ఔషధ టెండర్లకు 5 కమిటీలు: దామోదర
ABN , Publish Date - Jun 18 , 2026 | 05:36 AM
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ)లో ఔషధ కొనుగోలు టెండర్లలో పారదర్శకత కోసం ఐదు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎ్‌సఐడీసీ)లో ఔషధ కొనుగోలు టెండర్లలో పారదర్శకత కోసం ఐదు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రెండు కమిటీలకు అదనంగా మరో 3 కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఔషధ కార్పొరేషన్‌లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న అధికారులను తక్షణమే బదిలీ చేయాలని సంస్థ ఎండీ గౌరవ్ ఉప్పల్‌ను ఆదేశించారు. టీజీఎంఎస్ఐడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ (సీఎంఎస్) ల పనితీరుపై బుధవారం మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 15 సీఎంఎస్ కేంద్రాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సంస్థ ద్వారా కొనుగోలు చేస్తున్న ఔషధాలు, సర్జికల్స్, రీజెంట్స్, పరికరాల టెండర్లలో పారదర్శకత ఉండేలా విధివిధానాలను రూపొందించాలని సూచించారు. . అన్ని స్థాయిల ఆస్పత్రులకు అవసరమైన పరికరాలకు సంబంధించి ఒక ప్రామాణిక జాబితాను తయారు చేసి, నిర్వహించాలని ఆదేశించారు. మందుల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేేసందుకు, క్యూర్ ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న రెండు సీఎంఎస్ కేంద్రాలకు అదనంగా మరో 4 కేంద్రాలను ఏర్పాటుచేయాలని సూచించారు. హిమోఫిలియా బాధితులకు ఔషధాలను ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించారు.