Share News

‘రోహిత్‌ వేముల వివక్ష నిరోధక’ బిల్లు రూపకల్పనకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:54 AM

ఉన్నత విద్యాసంస్థల్లో వ్యక్తిగత గుర్తింపు ఆధారిత వివక్ష నిరోధక చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ‘క్యాబినెట్‌ సబ్‌ కమిటీ’ని ఏర్పాటు చేసింది.

‘రోహిత్‌ వేముల వివక్ష నిరోధక’ బిల్లు రూపకల్పనకు క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు

  • చైర్మన్‌గా భట్టి, సభ్యులుగా ఉత్తమ్‌, దామోదర్‌, దుద్దిళ్ల, పొన్నం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి) : ఉన్నత విద్యాసంస్థల్లో వ్యక్తిగత గుర్తింపు ఆధారిత వివక్ష నిరోధక చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ‘క్యాబినెట్‌ సబ్‌ కమిటీ’ని ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో 2016 సంవత్సరం జనవరిలో మృతి చెందిన రోహిత్‌ వేముల పేరుతో ఈ బిల్లును రూపొందించనుంది. ‘రోహిత్‌ వేముల తెలంగాణ(ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఐడెంటిటీ బేస్డ్‌ డిస్ర్కిమినేషన్‌ ఇన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌)బిల్‌-2026’ పేరుతో రూపొందించనున్న ఈ బిల్లుకు అవసరమైన అంశాలపై అధ్యయనం చేసి తగిన సలహాలు, సిఫారసులు చేయడానికిగాను ఈ క్యాబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. కమిటీ చైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ను నియమించింది. షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. సాధ్యమైనంత త్వరగా కమిటీ తన నివేదికను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. వర్సిటీల వంటి ఉన్నత విద్యా సంస్థల్లో కుల, మత, వర్గ గుర్తింపు ఆధారిత వివక్షను అరికట్టడమే ఈ కొత్త బిల్లు ఉద్దేశం.

Updated Date - Apr 18 , 2026 | 04:54 AM