ఆహార కల్తీ కేటుగాళ్ల పని పడతాం
ABN , Publish Date - Apr 07 , 2026 | 05:07 AM
ఆహార కల్తీ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి సురక్షిత, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం..
డ్రగ్స్‌కు ఈగల్ మాదిరిగా ఫుడ్ సేఫ్టీపై ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు: మంత్రి దామోదర
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ‘ఆహార కల్తీ కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రతి పౌరుడికి సురక్షిత, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం అందేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ‘డ్రగ్స్ నిర్మూలనకు ఈగిల్ మాదిరిగా ఫుడ్ సేఫ్టీ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పించారు. శాస్త్రీయ అధ్యయనం తర్వాత కొత్త వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తాం’ అని చెప్పారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో సోమవారం ప్రారంభమైన ఆరోగ్య వారోత్సవంలో తొలి రోజు ఫుడ్ సేఫ్టీపై ఆరోగ్యశాఖ నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి దామోదర పాల్గొన్నారు. నెక్లెస్ రోడ్డులోని జల విహార్‌లో ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాక్‌ను ప్రారంభించారు. హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ వద్ద వాక్ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ కేవలం సర్కారు బాధ్యతే కాదని, సమాజంలోని అందరి సమిష్ఠి బాధ్యత అని పేర్కొన్నారు. ‘ఈట్ రైట్ -- స్ట హెల్తీ’’ అనే సందేశాన్ని అందరం ఆచరించి కలిసికట్టుగా ఆరోగ్య తెలంగాణ నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో గల 1.41 లక్షల ఫుడ్ బిజినెస్ సంస్థల్లో 80 శాతం పట్టణాల్లోనే కేంద్రీకృతమయ్యాయని ఆయన చెప్పారు. దీంతో రెడీ టు ఈట్, ప్రాసెస్డ్ ఆహార పదార్థాలకు గల అధిక డిమాండ్‌ను కొందరు దుర్వినియోగం చేస్తూ ప్రతి ఆహార పదార్థంలో కల్తీకి పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రజలు జీర్ణకోశ సంబంధ వ్యాధులతోపాటు పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ బలోపేతానికి కొత్తగా 24 మంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, 5 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ వాహనాలను రంగంలోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్, ఇతర ఉన్నతాధికారులతోపాటు సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రిలో జరిగిన ఈట్ రైట్’ మేళాలో మిల్లెట్లతో తయారైన పలు స్టాళ్లను మంత్రి సందర్శించారు.