ప్రమాదంలో ఆహార నాణ్యత
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:54 AM
రాష్ట్రంలో ఆహార నాణ్యత ప్రమాదంలో పడింది. ఆహార పదార్థాల కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా ఈగిల్ వ్యవస్థను....
రాష్ట్రంలో 1.40 లక్షల ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు
తనిఖీలకు సరిపోని ఆహార భద్రతా సిబ్బంది
నిబంధనల మేర ప్రతి వెయ్యికి ఒక ఎఫ్‌ఎస్వో అవసరం
మంజూరైన పోస్టులు 81.. ఉన్న సిబ్బంది 44 మందే
మరో వంద మంది అవసరమని నిపుణుల సూచన
కల్తీ ఆహారంతో దెబ్బతింటున్న ప్రజల ఆరోగ్యం
అరకొర సిబ్బందితోనే తనిఖీలు పెంచిన అధికారులు
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆహార నాణ్యత ప్రమాదంలో పడింది. ఆహార పదార్థాల కల్తీ విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా ఈగిల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లుగానే ఫుడ్‌సేఫ్టీపై ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘ఆహార భద్రత, ప్రమాణాల చట్టం-2006’ కింద ఆరోగ్య, వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఆహార భద్రత కమిషనర్ నేతృత్వంలో అధికారులు, ఇన్‌స్పెక్టర్లు కలిసి రాష్ట్రవ్యాప్తంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే పెరుగుతున్న ఫుడ్ బిజినె్‌సకు తగ్గట్లుగా ఫుడ్ సేఫ్టీ విభాగంలో మానవ వనరులు లేకపోవడంతో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం నెరవేరడం లేదు. పర్యవేక్షణ లేక రాష్ట్రంలో ఆహారకల్తీ విచ్చలవిడిగా సాగుతోంది. నిత్యావసరాల దగ్గర్నించి అన్నింటా ఏదో రూపంలో కల్తీ జరుగుతోంది. కల్తీ ఆహార పదార్థాలను తిని ప్రజలు రోగాలు బారినపడుతున్నారు.
రాష్ట్రంలో 1.40 లక్షల ఎఫ్‌బీవోలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,40,744 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు (ఎఫ్‌బీవో) ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా కోర్ అర్బన్ ఏరియాలో 80 వేలకుపైగా వ్యాపారాలు ఉండటం గమనార్హం. నమోదు కాని చిన్న వ్యాపారులను కూడా.. చట్టం పరిధిలోకి తీసుకురావడానికి అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. దీంతో మరో 2,758 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల మేరకు ప్రతీ వెయ్యి ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కచ్చితంగా ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. ఈ లెక్క ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 144 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు అవసరం. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో 81 శాంక్షన్డ్ ఫుడ్ సేఫ్టీ అధికారుల పోస్టులే ఉన్నాయి. వీటిలో పని చేస్తున్నది 44 మందే అంటే ఉన్న పోస్టుల్లోనే 50 శాతం ఖాళీలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫుడ్ సేఫ్టీ అధికారుల పోస్టుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న ఆహార సంబంధిత వ్యాపారాల దృష్ట్యా కొత్తగా మరో 63 పోస్టులైనా అవసరం ఉందంటున్నారు. వీటితోపాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 37 పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని సూచిస్తున్నారు. ఉన్న సిబ్బందిని ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ సంగీతా సత్యానారాయణ పరుగులు పెట్టిస్తున్నారు. తనిఖీల సంఖ్యను పెంచారు. 2024-25లో 3,615 తనిఖీలు జరుపగా.. ఈసారి 8,421కి చేరాయి. అలాగే నమూనాల పరీక్షలు కూడా 7,644 నుండి 11,498కు పెరిగాయి. వీటిలో 271 నమూనాలను అసురక్షితమైనవిగా, 504 నమూనాలను నాణ్యతలేమితో ఉన్నట్లుగా గుర్తించారు. పాలు, మిఠాయిలు, మసాలాలు, నూనెలు, ఉప్పు, ఈ-కామర్స్ ఫుడ్ సరఫరా వంటి రంగాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. మొత్తం 1033 తయారీదారులు, రిటైలర్లను తనిఖీ చేసి 660 నమూనాలు, 1,266 సర్వైలెన్స్ నమూనాలు ేసకరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నోటీసులు, కేసులు, లైసెన్స్ రద్దు వంటి చర్యలు తీసుకుంటున్నారు. తీవ్రమైన కల్తీ కేసుల్లో క్రిమినల్ విచారణ కూడా ప్రారంభించారు. మరోవైపు, ‘ఈట్ రైట్’ కింద 80 గురుకుల పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
కల్తీ ఆహారంతో జీర్ణాశయ క్యాన్సర్
ఆహార కల్తీ ఒక నిశ్శబ్ద వైద్య సంక్షోభం. కృత్రిమ రంగులు, పరిశ్రమలలో ఉపయోగించే ఫిల్లర్లు, అనుమతులు లేకుండా వినియోగించే ప్రిజర్వేటివ్స్ ఉదర సమస్యలకు దారి తీస్తాయి. ఇవి దీర్ఘకాలిక మ్యూకోసల్ వాపును ప్రేరేపిస్తాయి. పేగులలోని సూక్ష్మజీవుల సమతౌల్యాన్ని (గట్ మైక్రోబయామ్)ను పూర్తిగా దెబ్బతీస్తాయి. కాలేయంపై భారం మోపుతాయి. ఆహార కల్తీలో వాడే రసాయనాలతో పెప్టిక్ ఆల్సర్లు వంటి తీవ్రమైన జబ్బులకు లోనయ్యే ప్రమాదం ఉంది. జీర్జాశయ క్యాన్సర్‌ల ముప్పును కూడా ఇవి పెంచుతాయి.
- డాక్టర్ ఆనంద్ కులకర్ణి, డైరెక్టర్ (క్రిటికల్ కేర్ హెఫటాలజీ సీనియర్ కన్సల్టెంట్) ఏఐజీ ఆస్పత్రి, హైదరాబాద్