యాదాద్రి ప్లాంట్‌పై ఫోకస్
ABN , Publish Date - Oct 16 , 2026 | 04:05 AM
బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎ్‌స)లో సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పాదన జరగడం లేదని, అలసత్వం వహించే అధికారులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన తీవ్ర హెచ్చరికతో యంత్రాంగంలో కదలిక వచ్చింది.
సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికతో అధికారుల్లో కదలిక
వైటీపీఎస్ వద్దకు నవీన్ మిట్టల్.. ప్లాంట్ పరిశీలన
వారంలోగా యూనిట్-5 సింక్ర నైజేషన్ పూర్తికి ఆదేశం
ప్లాంట్ పర్యవేక్షణకు ఐదుగురు ఐఏఎస్ ల నియామకం
హైదరాబాద్/దామరచర్ల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎ్‌స)లో సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పాదన జరగడం లేదని, అలసత్వం వహించే అధికారులపై వేటు తప్పదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన తీవ్ర హెచ్చరికతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఇప్పటికే జెన్కో సీఎండీ ఎస్.హరీశ్ రెండు రోజులుగా నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని వైటీపీఎస్ వద్ద మకాం వేయగా.. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్ కూడా గురువారం అక్కడ పర్యటించారు. జెన్కో సీఎండీ ఎస్.హరీశ్‌తోపాటు బీహెచ్ఈఎల్ అధికారులతో కలిసి ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్, క్రషర్ హౌస్, ట్రాక్ హాపర్, వ్యాగన్ టిప్లర్లు, వీజీఎఫ్ లు, మార్షలింగ్ యార్డ్, సీసీఆర్ ప్రాంతాలను పరిశీలించారు. వారం రోజుల్లో వైటీపీఎ్సలోని యూనిట్-5 సింక్ర నైజేషన్ చేపట్టాలని సూచించారు. ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌లో ఎదుర్కొంటున్న సమస్యలపై బీహెచ్ఈఎల్తో చర్చించారు. గుర్తించిన సమస్యలన్నింటినీ ప్రాధాన్య క్రమంలో పరిష్కరించడానికి వీలుగా చర్యలు తీసుకుంటామని బీహెచ్ఈఎల్ అధికారులు నివేదించారు. రాష్ట్రంలో గురువారం అత్యధికంగా 20,003మెగావాట్ల డిమాండ్ నెలకొందని, అయినప్పటికీ ఈ డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్‌ను అందించామని తెలిపారు. ప్రారంభ దశ లో సమస్యలు ఉన్నప్పటికీ 4యూనిట్లలో 2109మెగావాట్లపైగా విద్యుదుత్పత్తి జరిగిందని గుర్తు చేశారు.
లోపాలమయంగా వైటీపీఎస్..!
రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం భారీగా నెలకొన్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడంలో ప్రత్యేక పాత్ర వైటీపీఎ్సదే. అయితే ఇక్కడ మొత్తం సిద్ధమైన నాలుగు యూనిట్లకుగాను మూడు యూనిట్లలో మాత్రమే విద్యుత్ ఉత్పాదన జరుగుతోంది. యూనిట్-1 (800 మెగావాట్లు)లో ఫ్లేమ్ ఫెయిల్యూర్ కారణంగా గురువారం నుంచి ఉత్పత్తి నిలిచిపోయింది. వాస్తవానికి యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలోనే లోపాలున్నాయి. కోల్‌హ్యాండ్లింగ్ ప్లాంట్ డిజైన్‌లో లోపాలు ఉండటంతో ఈ ప్లాంట్‌లో బొగ్గు లభ్యత ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. కన్వేయర్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడంతో దీనిని సరిచేయడానికి ఏడాది కాలంగా అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. మరోవైపు ఇది నాన్ పిట్‌హెడ్ ప్లాంట్. కోల్బ్లాకులకు 300 కిలోమీటర్ల దూరంలో ప్లాంట్ ఉంటుంది. దాంతో ప్రస్తుతం నైనీ కోల్(సింగరేణి) బ్లాక్ నుంచి బొగ్గును సరఫరా చేస్తున్నారు. అయినప్పటికీ అత్యంత తక్కువ బొగ్గు నిల్వలు ఈ ప్లాంట్‌లో ఉన్నాయి. మహానది(ఒడిశా) కోల్ ఫీల్డ్ నుంచి కోల్ లింకేజీ కోసం జెన్కో ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. త్వరలోనే ఇది సాకారమయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా కన్వేయర్ సిస్టమ్‌లో లోపాలు సవరించుకుంటే పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం కలగనుంది. యాదాద్రి ప్లాంట్‌లోని సీవోడీ అయిన నాలుగు యూనిట్లలో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందా? లేదా? ఉత్పాదనకు అవసరమైన బొగ్గు అందుతుందా? ప్లాంట్‌కు అవసరమైన బొగ్గును తరలించే రేకులు అన్లోడ్ అవుతున్నాయా? లేదా? వంటి అంశాలను పరిశీలించేందుకు ప్రభుత్వం ఐదుగురు ఐఏఎస్‌లను నియమించింది. ప్లాంట్‌లోని 4 బొగ్గు ఆధారిత యూనిట్ల పనితీరు, బొగ్గు నాణ్యత, సరఫరాలో ఆటంకాలు, అసంపూర్తి పనులపై నివేదికలు అందించాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది.