నియంత్రణాధికారిగా కాకుండా..సహాయకారిగా ప్రజాప్రభుత్వం
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:38 AM
నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా’’ తమ ప్రజా ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం మారినా విధాన స్థిరత్వం
దీంతో పెట్టుబడిదారులకు భరోసా
టీజీ ఐపాస్‌తో 21 రోజుల్లోనే అనుమతులు
జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం
2047కు రెట్టింపు చేస్తాం: శ్రీధర్ బాబు
హైదరాబాద్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : ‘‘నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా’’ తమ ప్రజా ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై పెట్టుబడిదారుల విశ్వాసానికి రెండు ప్రధాన అంశాలు కారణమని, రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీలు మారినా కొనసాగుతున్న విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య నిర్వహణ పెట్టుబడిదారులకు భరోసానిస్తున్నాయని తెలిపారు. టీజీ ఐపాస్ సింగిల్ విండో వ్యవస్థ ద్వారా అనుమతులు 21 రోజుల్లోనే మంజూరవుతున్నాయని, ఇప్పుడు ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’’ ద్వారా సాంకేతికత సహాయంతో మరింత పారదర్శకత, పెండింగ్ అనుమతుల రియల్-టైమ్ ట్రాకింగ్ అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఈమేరకు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రస్తుతం దేశ జీడీపీలో దాదాపు 5ువాటాను అందిస్తోందని, 2047 నాటికి ఈ వాటాను రెట్టింపు చేయాలని భావిస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 65 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ ఏడాది 21,000 కోట్ల రుణాలు అందించామని, వారి ఎన్‌పీఏలు దాదాపు సున్నా స్థాయిలో ఉన్నాయని తెలిపారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం
ఎంఎ్‌సఎంఈల కోసం వచ్చే ఐదేళ్లకు రూ. 600 కోట్లు కేటాయించినట్లు, ప్రతి జిల్లాలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. భూమి కొనుగోలు చేయకుండా లీజుకు తీసుకునే విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కొత్త పార్కుల స్థలంలో నాలుగో వంతు మహిళా పారిశ్రామికవేత్తలకు కేటాయించనున్నారని చెప్పారు. ఆర్థిక సహాయం పొందడంలో, సాంకేతికతను(ఏఐతో సహా) అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్న ఎంఎ్‌సఎంఈలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ‘‘ఇండస్ర్టీ హెల్త్ క్లినిక్‌ల’’ను ప్రారంభించిందని వెల్లడించారు.