Share News

రోడ్లు, భవనాల శాఖలో ఎక్సెస్‌కు పరిష్కారం!

ABN , Publish Date - May 23 , 2026 | 04:58 AM

రోడ్లు-భవనాల శాఖలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌(హ్యామ్‌) విధానంలో చేపట్టాలని నిర్ణయించిన రోడ్ల పనుల టెండర్లలో వచ్చిన ఎక్సెస్‌ ధరల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది.

రోడ్లు, భవనాల శాఖలో ఎక్సెస్‌కు పరిష్కారం!

  • జీఎస్టీని పనుల వారీగా చెల్లించాలని నిర్ణయం

  • క్యాబినెట్‌లో ఆమోదం పొందగానే చర్యలు

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): రోడ్లు-భవనాల శాఖలో హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌(హ్యామ్‌) విధానంలో చేపట్టాలని నిర్ణయించిన రోడ్ల పనుల టెండర్లలో వచ్చిన ఎక్సెస్‌ ధరల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. అధికారికంగా తేలిన 14.5శాతం ఎక్సెస్‌ ధరల్లో 4శాతం వాటా ఉన్న పెట్రోలింగ్‌ వాహనాలు, అంబులెన్స్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. మిగిలిన 10శాతంలో ప్రధానంగా ఉన్న కాంట్రాక్టర్లు చెల్లించే జీఎస్టీ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది. పనుల వారీగా కాంట్రాక్టర్లు చెల్లించిన జీఎస్టీని ప్రభుత్వానికి సమర్పిస్తే ఆ జీఎస్టీని వెంటనే కాంట్రాక్టర్లకు రీయింబర్స్‌మెంట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఫైలు శనివారం జరిగే క్యాబినెట్‌లో ఆమోదం పొందాక ఇప్పుడున్న టెండర్లలోనే మార్పులు చేసి, పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీరాజ్‌ శాఖల్లో కలిపి హ్యామ్‌ రోడ్ల బడ్జెట్‌ దాదాపు రూ.19వేల కోట్లకు చేరింది. అయితే ఆర్‌ అండ్‌ బీలో పనుల నిర్వహ ణకు టెండర్లను ఆహ్వానించగా 14.5శాతం నుంచి 23.5శాతం, 50.2శాతం, 70.2శాతం చొప్పున ఎక్సెస్‌ టెండర్లు దాఖలయ్యాయి. ఇంత పెద్ద ఎత్తున ఎక్సెస్‌ ధరలు రావడంతో దుమారం రేగింది. ఎక్సెస్‌ అంశాలను ఎస్టిమేట్స్‌లో చేర్చకపోవడంపై సీఎం రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో అధికారులు పరిష్కార మార్గాన్ని తేల్చారు. రోడ్ల పనుల కోసం ప్రభుత్వం ఇచ్చే మొబిలిటీ అడ్వాన్స్‌తో పాటు బ్యాంకుల నుంచి కాంట్రాక్టర్లు తీసుకునే రుణానికి చెల్లించే జీఎస్టీని కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టే సమయంలోనే రీయింబర్స్‌ చేయాలని నిర్ణయించారు.

Updated Date - May 23 , 2026 | 04:58 AM