చెరువులూ లేవు.. చేపలూ లేవు..
ABN , Publish Date - Aug 22 , 2026 | 05:37 AM
ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎం-ఎంఎ్‌సవై) పథకానికి ఎంపికయ్యారు.. చేపల చెరువులు తవ్వారు.. చేపలు పెంచుతున్నామంటూ భారీగా సబ్సిడీలు పొందారు.. కానీ వెళ్లి చూస్తే..
పీఎం-మత్స్య సంపద యోజనలో భారీ అక్రమాలు
చేపల చెరువులు తవ్వకుండానే తవ్వినట్లు రికార్డులు
రెండేళ్లలో రూ.80 కోట్ల దుర్వినియోగం
అక్రమాలను ధ్రువీకరించిన విచారణ బృందం
వ్యవహారం బయటికి రాకుండా తొక్కిపెట్టిన వైనం
మత్స్యశాఖ డైరెక్టరేట్‌లోని ఓ ఉన్నతాధికారి హస్తం!
వరుసగా ఒకే సంస్థకు రొయ్య పిల్లల సరఫరా టెండర్లు
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎం-ఎంఎ్‌సవై) పథకానికి ఎంపికయ్యారు.. చేపల చెరువులు తవ్వారు.. చేపలు పెంచుతున్నామంటూ భారీగా సబ్సిడీలు పొందారు.. కానీ వెళ్లి చూస్తే.. అక్కడ చెరువులూ లేవు.. చేపలూ లేవు.. కేవలం కాగితాలపైనే అన్నీ సృష్టించారు. కొందరు లబ్ధిదారుల పేరిట అధికారులే దండుకున్నారు. కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. గతం లోనే దీనిపై ఫిర్యాదులు రాగా, విచారణ జరిపిన కేంద్రం ఎన్నో అవకతవకలు ఉన్నట్టు తేల్చింది. ఇది జరిగి సుమారు మూడేళ్లయినా నివేదికను బయటపెట్టలేదు. సదరు అక్రమార్కులపై చర్యలు చేపట్టలేదు. అయితే ఈ వ్యవహారంలో రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టరేట్‌లోని ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నట్టు తాజాగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో.. అక్రమాల వ్యవహారం బయటికి వచ్చింది.
రూ.80 కోట్ల మేర దుర్వినియోగం!
కేంద్రం దేశవ్యాప్తంగా కొత్త చేపల చెరువుల తవ్వకానికి, చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు పీఎం-ఎంఎస్‌వై పథకాన్ని అమలు చేస్తోంది. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో తవ్విన చేపల చెరువును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. ఒక్కో యూనిట్ విలువ రూ.11 లక్షలుకాగా.. అందులో 60 శాతం సబ్సిడీ కింద అందుతుంది. ఇక కోల్డ్ స్టోరేజీలు, బయో యూనిట్ల నిర్మాణానికి రూ.8 లక్షల చొప్పున రుణసాయం అందిస్తారు. ఇందులోనూ రూ. 3.20 లక్షలు సబ్సిడీ అందుతుంది. అయితే రాష్ట్రంలో ఈ పథకంలో భారీగా అక్రమాలు జరిగాయని, రెండేళ్ల వ్యవధిలో రూ.80 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. దీనితో కేంద్రం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టరేట్ నుంచి ఒక సీనియర్ అధికారి నేతృత్వంలోని బృందం క్షేత్రస్థాయిలో పర్యటించింది. నల్లగొండ జిల్లాలో రూ.2.50 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.4 కోట్లు దుర్వినియోగమైనట్టు తేల్చింది. పలు రకాల అక్రమాలను గుర్తించింది. చెరువుల నిర్మాణ విస్తీర్ణం, ఎం-బుక్‌లో నమోదైన వివరాలకు పొంతనలేదు. చేపల చెరువుల ఆచూకీ కనిపించలేదు. చెరువులు నిర్మించినట్టు పేర్కొన్న ప్రదేశాలు కూడా దొరకలేదు. ఒకచోట అసలు చెరువే కనిపించకపోగా.. మరోచోట చిన్న గుంత మాత్రమే కనిపించింది. చేపల పెంపకం ఏమీ జరగలేదని పలువురు లబ్ధిదారులు విచారణ అధికారులకు వివరించడం గమనార్హం. ఇక ఒక చోట హెక్టారు విస్తీర్ణంలో చేపట్టిన చేపల చెరువు నిర్మాణానికి వ్యయం రూ.7,99,851గా లెక్కచూపారు. లబ్ధిదారుకు రూ.3,39,150 మాత్రమే సబ్సిడీ అందింది. కానీ చేపల పెంపకం జరగలేదు. మరోచోట రూ.41 లక్షలకుపైగా పని విలువ చూపించగా.. ఏకంగా రూ. 47.60 లక్షలు సబ్సిడీ అందినట్టు నమోదు చేశారు. మొత్తంగా ఈ వ్యవహారంపై 2023 ఏప్రిల్‌లోనే రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌కు నివేదిక అందింది. కానీ అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి వరుస ఫిర్యాదులు వచ్చాయి.
దశాబ్దకాలం నుంచి ఓ అధికారి పెత్తనం
చేపల చెరువుల వ్యవహారం వెనుక మత్స్యశాఖ డైరెక్టరేట్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక ఉన్నతాధికారి హస్తం ఉన్నట్టు ప్రభుత్వానికి తాజాగా ఫిర్యాదులు వచ్చాయి. కీలకమైన ప్రణాళిక విభాగం దశాబ్దకాలానికిపైగా సదరు అధికారి చేతుల్లోనే ఉందని.. ఎస్టాబ్లిష్‌మెంట్, ఫైనాన్స్, మత్స్యశాఖలో అధికారుల బదిలీలు, డిప్యూటేషన్లు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల పథకాల అమలు తదితర వ్యవహాలన్నీ ఆ అధికారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని మత్స్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పీఎం-ఎంఎస్‌వై, బీఆర్‌ఎస్, ఆర్‌కేవీవై పథకాల అమల్లో భారీగా అక్రమాలు జరిగాయని, అందులో సదరు ఉన్నతాధికారి హస్తం ఉందని ఆరోపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ‘ఆర్‌ఏఎస్’(రీ- సర్య్యులేటరీ ఆక్వా- కల్చర్ సిస్టమ్) నిర్మాణాలు చేపట్టకుండానే, మేజర్‌మెంట్ బుక్‌లు సృష్టించి కోట్ల రూపాయలు దుర్వినియోగంచేసినట్లు శాఖలోని సిబ్బందే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. హిమబిందు అనే మహిళ తన భూమిలో చేపల చెరువులు నిర్మించినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి నిధులు కాజేశారని ఫిర్యాదు చేశారు.
నాలుగేళ్లుగా ఒకే కంపెనీకి రొయ్యల టెండరు
రాష్ట్రంలో రొయ్యల సాగును ప్రోత్సహించేందుకు ఎంపిక చేసిన రిజర్వాయర్లు, చెరువుల్లో రొయ్యపిల్లలను పోసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. 2025-26లో ‘ఎంఎ్‌సఆర్’ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 5.40 కోట్ల రొయ్యపిల్లలను సరఫరా చేసే టెండర్ దక్కింది. గత నాలుగేళ్లుగా కూడా ఆ కంపెనీకే సరఫరా కాంట్రాక్టు ఇవ్వడం గమనార్హం. మత్స్యశాఖ డైరెక్టరేట్‌లోని ఒక ఉన్నతాధికారి దీని వెనుక ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నిజానికి ఏటా సుమారు రూ.116 కోట్లు ఖర్చు చేస్తున్న ఉచిత చేప పిల్లలు, రొయ్యపిల్లల పంపిణీ పథకంలో 50శాతానికిపైగా నిధులు దుర్వినియోగం అవుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.