Share News

కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:29 AM

రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

కూసుమంచిలో సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్‌

  • ప్రతి భూమికి సర్వే మ్యాప్‌, భూధార్‌ నంబర్‌: పొంగులేటి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో భూభారతి ఇంటిగ్రేటెడ్‌ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్‌ ఉండాలన్న నిబంధననూ అమలు చేస్తున్నామని ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలంలోని మోటాపురం గ్రామంలో సర్వే నంబరు 156/ఇ/1లో ఎకరా నాలుగు గుంటల భూమికి సర్వే మ్యాప్‌తో తొలి రిజిస్ట్రేషన్‌ జరిగిందని వెల్లడించారు. గ్రామానికి చెందిన భాగం కిషన్‌రావు అనే రైతు అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు భూమిని విక్రయించారని.. రిజిస్ట్రేషన్‌ సందర్భంగా తహసీల్దార్‌ భూ పటాన్ని, భూధార్‌ నంబరును కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ విధానాన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. భూభారతి చట్టం ద్వారా ప్రతి భూమికి ఖచ్చితమైన సర్వే మ్యాప్‌, ప్రత్యేక భూధార్‌ నంబరు కేటాయిస్తామని తెలిపారు. ఇలా చేయడం వల్ల భూ హక్కులకు సంబంధించి ఎలాంటి సందేహాలకు తావుండదన్నారు. భూ హక్కులకు భరోసా కల్పిస్తామని, భూభారతి పోర్టల్‌ దేశానికే ఆదర్శంగా నిలవనుందని ఆయన తెలిపారు.

Updated Date - Apr 22 , 2026 | 05:29 AM