Share News

నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా, జైలుశిక్ష

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:04 AM

అగ్నిమాపక శాఖ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారికి జరిమానాతోపాటు తీవ్రతను బట్టి జైలు శిక్ష పడే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ హెచ్చరించారు.

నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా, జైలుశిక్ష

  • త్వరలోనే అగ్ని మాపక చట్టంలో సవరణలు

  • ప్రమాదాలపై ఇన్‌స్పెక్టర్‌, ఆపై స్థాయిలో విచారణ

  • పోలీసులతోపాటు ఫైర్‌ ఆఫీసర్‌ నివేదిక కీలకం

  • ప్రతి నిర్మాణానికీ అనుమతి తప్పనిసరి కానుంది

  • త్వరలో ఖాళీల భర్తీ.. కొత్త వాహనాలు కొంటాం

  • అగ్నిమాపక వారోత్సవాల్లో డీజీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక శాఖ నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాంటి వారికి జరిమానాతోపాటు తీవ్రతను బట్టి జైలు శిక్ష పడే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్‌ సింగ్‌ మాన్‌ హెచ్చరించారు. నిబంధనలను కఠినతరం చేస్తూ అగ్నిమాపక శాఖ చట్టం- 1999లో పలు కీలక సవరణలు చేయనున్నట్లు తెలిపారు. వట్టినాగులపల్లిలోని అగ్నిమాపకశాఖ అకాడమీలో అగ్నిమాపక వారోత్సవాల వాల్‌పోస్టర్‌, కరపత్రాలను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందు అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ‘సురక్షితమైన పాఠశాల, ఆసుపత్రి - అగ్ని భద్రతపై అవగాహన కలిగిన సమాజం’ అనే ఇతివృత్తంతో మంగళవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు మరింత కఠినతరం కానున్నాయని డీజీ తెలిపారు. అగ్ని మాపక శాఖ చట్టం-1999 లో సవరణలకు ముసాయిదా రూపొందించామని, ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత నూతన చట్టం అమల్లోకి రానుందని తెలిపారు. ప్రస్తుతం అనుకోని ప్రమాదం జరిగి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లితే స్థానిక పోలీసులు విచారణ జరుపుతుండగా.. నూతన చట్టం అమల్లోకి వచ్చాక ఇన్‌స్పెక్టర్‌, ఆపై స్థాయి అధికారి విచారణ చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పోలీస్‌ నివేదికతోపాటు స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ నివేదికను చార్జిషీట్‌లో పొందుపర్చాల్సి ఉంటుందని వివరించారు. షోకాజ్‌ నోటీసులు అందుకున్న వారు.. ఇకపై క్రిమినల్‌ కోర్టుల్లో విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రతి నిర్మాణానికి అనుమతి తప్పనిసరి కానుందని తెలిపారు. ఎత్తైన భవనాల్లో అనుకోని ప్రమాదం జరిగితే సత్వరం స్పందించేందుకు నూతన వాహనాలు, సాంకేతిక పరిజ్ఞానం వాడుకలోకి తెస్తున్నామని డీజీ పేర్కొన్నారు. ప్రస్తుతం 54 మీటర్ల ఎత్తు వరకు వెళ్లి మంటలు అదుపుచేయడంతోపాటు బాధితులను రక్షించేందుకు హైడ్రాలిక్‌ మెషీన్‌ అందుబాటులో ఉందని తెలిపారు. త్వరలో 104 మీటర్ల ఎత్తు వరకు వెళ్లేందుకు స్కై ఫైట్‌ హైడ్రాలిక్‌ మిషన్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నామన్నారు. ప్రభుత్వ అనుమతితో త్వరలోనే ఖాళీలు భర్తీ చేయనున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2024లో అగ్నిప్రమాదాల్లో 84 మంది మృతి చెందగా, 2025లో ఆ సంఖ్య 158కి పెరిగిందన్నారు. సిగాచి పరిశ్రమ ప్రమాదంలో 54 మంది, గుల్జార్‌హౌస్‌ ప్రమాదంలో 17 మంది మృతి చెందడం వల్లే.. ఈ ఏడాది మృతుల సంఖ్య పెరిగిందని తెలిపారు.

Updated Date - Apr 15 , 2026 | 05:04 AM