ఒక్కో కాలేజీ నుంచి రూ.6 లక్షలు!
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:53 AM
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుమతుల కోసం సమర్పించిన అగ్నిమాపక శాఖ నకిలీ నిరభ్యంతర పత్రాల (ఫైర్ ఎన్వోసీల) వ్యవహారం కలకలం రేపుతోంది. దీని వెనుక ఉన్న కుంభకోణం బయటపడుతోంది.
నకిలీ ఫైర్ ఎన్వోసీ కోసం వసూళ్లు
డీఐఈవోల నుంచి ఉన్నతాధికారుల వరకు పంపకాలు
ఏటా ఇదే తంతు.. యథేచ్ఛగా కాలేజీలకు అనుమతులు
హైడ్రా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ల సంతకాల ఫోర్జరీతో ఎన్వోసీలు
180 కళాశాలలు నకిలీ ఎన్వోసీలు సమర్పించినట్లు గుర్తింపు
ఆ కాలేజీల అనుమతులు రద్దుచేస్తాం: ఇంటర్ విద్య కార్యదర్శి
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనుమతుల కోసం సమర్పించిన అగ్నిమాపక శాఖ నకిలీ నిరభ్యంతర పత్రాల (ఫైర్ ఎన్వోసీల) వ్యవహారం కలకలం రేపుతోంది. దీని వెనుక ఉన్న కుంభకోణం బయటపడుతోంది. ఇందులో జిల్లా ఇంటర్ విద్య అధికారి (డీఐఈవో) నుంచి ఇంటర్మీడియట్ బోర్డులోని ఉన్నతాధికారుల వరకు ఉన్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా గుర్తించిన మేరకు నకిలీ ఫైర్ ఎన్వోసీలు సమర్పించిన కాలేజీల సంఖ్య దాదాపు 180వరకు ఉందని.. ఒక్కో కాలేజీ నుంచి రూ.6 లక్షల మేర అధికారులకు ముట్టినట్టు చెబుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ సమర్పించిన ఎన్వోసీపై అనుమానంతో ఇంటర్ విద్య కార్యదర్శి విచారణకు ఆదేశించగా నకిలీ ఎన్వోసీల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్లుగా ఇది సాగుతున్నా ఎలాంటి విచారణ లేకుండానే అనుమతులిస్తూ రావడం గమనార్హం. జూనియర్ కాలేజీలు ఏటా అనుమతులు పొందాల్సి ఉంటుంది. అందుకోసం ఫైర్ ఎన్వోసీలు సమర్పించడం తప్పనిసరి. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఫైరింజన్ వెళ్లగలిగేలా భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉండాలి. కాలేజీలోని ప్రతి గదిలో అగ్నిమాపక నివారణ యంత్రాలు ఏర్పాటు చేయాలి. దీనితోపాటు మరికొన్ని నిబంధనలు పాటిస్తేనే.. ఈ ఎన్వోసీ జారీ చేస్తారు. కాలేజీ భవనం ఎత్తు 15 మీటర్ల లోపుంటే హైడ్రా, దాటితే అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఎన్వోసీ జారీచేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని జూనియర్ కాలేజీల భవనాలు 15 మీటర్ల లోపే ఉంటాయి. అంతేకాదు వాటిలో అత్యధికం వాణిజ్య భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
నిబంధనలు కచ్చితంగా పాటించలేని కాలేజీలు.. ఇలా నకిలీ ఫైర్ ఎన్వోసీల బాటపట్టాయి. డీఐఈవోల నుంచి ఇంటర్ బోర్డులోని అధికారుల వరకు అందరికీ ఈ వ్యవహారం తెలిసినా.. క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. నకిలీ ఎన్వోసీలు ఇచ్చినా ఇబ్బందులు లేకుండా తాము చూసుకుంటామంటూ కొందరు అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం ఒక్కో కాలేజీ నుంచి రూ.6 లక్షలు వసూలు చేస్తున్నారని సమాచారం. అంటే ఇప్పుడు గుర్తించిన సుమారు 180 కాలేజీల నుంచి అధికారులకు రూ.10 కోట్లపైనే అందినట్టు అంచనా. మరోవైపు ప్రభుత్వం ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’ని రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. అప్పటివరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న అగ్నిమాపక విభాగాన్ని హైడ్రాలో విలీనం చేశారు. హైడ్రాకు ముందు జీహెచ్‌ఎంసీ పరిధిలోని అగ్నిమాపక విభాగం కాలేజీలకు ఫైర్ ఎన్వోసీలు జారీ చేయగా.. విలీనం తర్వాత ఆ అధికారం బాధ్యత హైడ్రా పరిధిలోకి వెళ్లింది. కానీ కాలేజీలు గత రెండేళ్లుగా కూడా జీహెచ్‌ఎంిసీ పేరుతో ఫైర్ ఎన్వోసీలు సమర్పించడం, అధికారులు ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం.
ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరిది?
ప్రతి ప్రైవేటు కాలేజీలో ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కలిపి సగటున 1,200 మంది వరకు సీట్లు ఉంటాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఏ కాలేజీ చూసినా విద్యార్థుల సంఖ్య వెయ్యికి పైగానే ఉంటుంది. చాలా కాలేజీలు ఏటా నకిలీ ఫైర్ ఎన్వోసీలు సమర్పించి అనుమతులు పొందుతున్నాయి. అయితే అలాంటి కాలేజీల్లో అగ్నిప్రమాదం సంభవిస్తే.. సహాయక చర్యలకు ఇబ్బంది తప్పదు. ప్రాణనష్టం జరిగే అవకాశాలూ ఎక్కువే. ఈ క్రమంలో సంబంధిత కాలేజీలు, అక్రమాలకు తోడ్పడిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి. నకిలీ ఎన్వోసీల వెనుక ఇంటర్‌బోర్డులోని ముగ్గురు ఉన్నతాధికారుల పాత్ర ఉందని, ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించి వారిపై చర్యలు చేపట్టాలని ప్రభుత్వ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి..
జూనియర్ కాలేజీలు అనుమతుల కోసం అడ్డదారి పట్టాయి. ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఎన్వోసీ పత్రాలను సృష్టించాయి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(టీ-క్యూర్) పరిధిలోని 142 కళాశాలల ఫైర్ ఎన్‌ఓసీలను పరిశీలించిన హైడ్రా అందులో 53 పత్రాలు నకిలీవని గుర్తించింది. ఈ క్రమంలో సంతకాలను ఫోర్జరీ చేసిన అంశం వెలుగులోకి వచ్చింది. జీహెచ్‌ఎంసీ కమిషనర్, రెండేళ్ల క్రితం హైడ్రాలో విలీనమైన ఈవీడీఎం, హైడ్రా కమిషనర్ల ఫోర్జరీ సంతకాలతో నకిలీ ఎన్వోసీలను రూపొందించినట్టు తేలింది.
ఆ కాలేజీల అనుమతులు రద్దు చేస్తాం: ఇంటర్ విద్య కార్యదర్శి
నకిలీ ఫైర్ ఎన్వోసీలు సమర్పించిన కాలేజీలపై కఠిన చర్యలు చేపడతామని, వాటి అనుమతులు రద్దు చేస్తామని ఇంటర్ విద్య కార్యదర్శి అభిలాష బుధవారం వెల్లడించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని హైడ్రాను ఆదేశించామని, హైడ్రా నుంచి నివేదిక వచ్చాక చర్యలు ఉంటాయని తెలిపారు. ఇటీవలే టాస్క్‌ఫోర్స్ బృందాలతో కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు చేయించామని, 75 కాలేజీలు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించామని వివరించారు. సదరు కాలేజీలకు గత నెల రోజుల్లో రూ. కోటి వరకు జరిమానా విధించామన్నారు. ప్రస్తుతం ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోందని.. అది ముగిశాక అన్ని కాలేజీలను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని కాలేజీలకు జరిమానాలు విధిస్తామని, నకిలీ ఫైర్ ఎన్వోసీలు ఇచ్చిన కాలేజీల అనుమతులు రద్దు చేస్తామని తెలిపారు.