వ్యయం రూ.2.44 లక్షల కోట్లు రాబడి రూ.2.60 లక్షల కోట్లు
ABN , Publish Date - May 14 , 2026 | 03:55 AM
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అన్ని మార్గాల ద్వారా రూ.2,60,007.65 కోట్ల రాబడి సమకూరింది. ప్రభుత్వం రూ.2,44,918.90 కోట్లు ఖర్చు చేసింది.
2025-26 సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదీ..
మూలధన వ్యయం 147.58 శాతం కావడం విశేషం
రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.9,235.06 కోట్లు
హైదరాబాద్, మే13 (ఆంధ్రజ్యోతి): 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అన్ని మార్గాల ద్వారా రూ.2,60,007.65 కోట్ల రాబడి సమకూరింది. ప్రభుత్వం రూ.2,44,918.90 కోట్లు ఖర్చు చేసింది. అంచనా వ్యయం రూ.2,63,486.73 కోట్లు కాగా అందులో 92.95 శాతం మేర నిధులనే తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందని ‘కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)’ బుధవారం విడుదల చేసిన మార్చి నెల నివేదికలో వివరించింది. వ్యయంలో సంక్షేమ పథకాలకు రూ.1,33,440.77 కోట్లను అంచనా వేయగా ప్రభుత్వం రూ.80,045.56 కోట్లు(59.99 శాతం) ఖర్చు చేసింది. వడ్డీ చెల్లింపులకు రూ.19,369.02 కోట్లను అంచనా వేయగా రూ.29,679.42 కోట్లు(153.23 శాతం), జీత భత్యాలకు రూ.44,478.87 కోట్లను అంచనా వేయగా రూ.47,400.10 కోట్లు(106.57శాతం), పెన్షన్లకు రూ.13,109.67 కోట్లను అంచనగా వేయగా రూ.19,371.21 కోట్లు(147.76 శాతం) ఖర్చు పెట్టింది. సబ్సిడీల అంచనా వ్యయం రూ.16,583.95 కోట్లు కాగా రూ.14,549.30 కోట్ల(87.73 శాతం)ను వ్యయం చేసింది. ఇక, అన్నింటి కంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మూలధన వ్యయం కింద ఎక్కువ మొత్తంలో నిధులను ఖర్చు చేసింది. ఇది ఒకందుకు మంచి పరిణామమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మూలధన వ్యయం కింద రూ.36,504.45 కోట్లను వ్యయం చేయాలని నిర్ణయించగా ఏకంగా రూ.53,873.31 కోట్ల(147.58 శాతం)ను ప్రభుత్వం వ్యయం చేసింది. కాగా, రాష్ట్రానికి అన్ని రకాల రాబడుల కింద రూ.2,84,837.30 కోట్లు వస్తాయని అంచనా వేయగా మార్చి 31 నాటికి రూ.2,60,007.65 కోట్లు సమకూరాయి. ఇది 91.28 శాతం. రాబడుల్లో రెవెన్యూ రాబడుల కింద రూ.2,29,720.63 కోట్లను అంచనా వేయగా రూ.1,81,810.53 కోట్లు(79.14 శాతం) సమకూరాయి. ఇందులో పన్నుల కింద రూ.1,75,319.36 కోట్లు వస్తాయని ఆశించగా రూ1,52,400.91 కోట్లు(86.93 శాతం) వచ్చాయి. మరోపక్క, ఈసారి కూడా కేంద్ర గ్రాంట్లు నిరాశనే మిగిల్చాయి. ఈ పద్దు కింద కేంద్రం నుంచి రూ.22,782.50 కోట్లు వస్తాయని ప్రభుత్వ అంచనా. కానీ సంవత్సరాంతానికి వచ్చింది రూ.10,422.98 కోట్లే(45.75 శాతం). మూలధన రాబడుల్లో భాగంగా రూ.54,009.74 కోట్ల అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినా రూ.77,762.35 కోట్ల అప్పులు తీసుకున్నది. ఇది అంచనా వేసిన అప్పులో 143.98 శాతం ఈసారి రెవెన్యూ మిగులు రూ.2,738.35 కోట్లు ఉంటుందని అంచనా వేయగా 9,235.06 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడింది. ద్రవ్యలోటు రూ.77,762.35 కోట్లను ప్రభుత్వం అప్పుల ద్వారా సర్దుబాటు చేసుకున్నది.