Share News

యాప్‌తో యూరియా అక్రమ రవాణాకు అడ్డుకట్ట

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:13 AM

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్‌ యాప్‌ (యూరియా యాప్‌) వల్లే ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని మంత్రి తుమ్మల ...

యాప్‌తో యూరియా అక్రమ రవాణాకు అడ్డుకట్ట

  • సిద్దిపేటలో 6 వేల బస్తాలు మాయమైనట్లు గుర్తించాం

  • ముగ్గురు వ్యాపారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాం: తుమ్మల

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్‌ యాప్‌ (యూరియా యాప్‌) వల్లే ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఫర్టిలైజర్‌ యాప్‌తో ఎరువుల లావాదేవీలన్నీ డిజిటల్‌ పద్ధతిలో నమోదవుతున్న నేపథ్యంలో తప్పుడు ఎంట్రీలు, కల్పిత బిల్లులు, అక్రమ నిల్వలు, యూరియా మళ్లింపులను సులభంగా గుర్తించగలిగామని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో 6 వేల యూరియా బస్తాలు మాయమైనట్టు యాప్‌ ద్వారా గుర్తించి, ఇద్దరు హోల్‌ ేసల్‌ డీలర్లు, ఒక రిటైలర్‌ లైసెన్సులను రద్దు చేసి అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వ్యవసాయశాఖ అధికారులపైనా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. యూరియా విక్రయాల్లో అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయో చెప్పడానికి సిద్దిపేట సంఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలోని ఒక సొసైటీ పరిధిలోనూ అక్రమాలు జరిగినట్లు గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం యూరియా యాప్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, ఫలితంగా అక్రమార్కులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3.64 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉందని తుమ్మల తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సరఫరా ప్రణాళిక ప్రకారం రాష్ట్రానికి 6 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, 5.62లక్షల టన్నులను తెప్పించగలిగామని పేర్కొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 04:13 AM