ఆగస్టు 15లోపు ఫస్టియర్ ఫీజులు
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:48 AM
విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మధ్య నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. ఆగస్టు 15వ తేదీలోపు విద్యార్థుల ఫస్టియర్ ఫీజులు చెల్లిస్తామని..
ఈ నెలాఖరుకు ఇతర సంవత్సరాల విద్యార్థులకూ చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
ఫీజు జీవోలపై స్టే తాత్కాలికంగా ఎత్తివేత
విద్యార్థుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేసిన తర్వాతే ఫీజు వసూలు చేయాలి
కాలేజీల యాజమాన్యాలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకు మధ్య నెలకొన్న వివాదం కొలిక్కి వచ్చింది. ఆగస్టు 15వ తేదీలోపు విద్యార్థుల ఫస్టియర్ ఫీజులు చెల్లిస్తామని, ఈ నెల చివరిలోగా ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజులు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అడ్మిషన్లు యథావిధిగా కొనసాగించాలని కాలేజీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇంజనీరింగ్ 2వ, 3వ, 4వ సంవత్సరాల విద్యార్థుల వివరాలను వారం రోజుల్లో సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని పేర్కొంది. ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నెల 31లోగా ఫీజులు చెల్లించాలని, ఫస్టియర్ విద్యార్థులకు ఆగస్టు 15లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఫీజుల జీవోలపై స్టేను ఆగస్టు 20 వరకు తాత్కాలికంగా ఎత్తేసింది. అప్పటివరకు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని ప్రైవేటు కాలేజీలను ఆదేశించింది. విద్యార్థుల ఖాతాలో ఫీజులు జమ అయిన తర్వాతే వారి నుంచి ఫీజులు తీసుకోవాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి వాయిదా వేసింది.
సుదీర్ఘ వాదనలు
ఫీజుల జీవోలను సవాల్ చేస్తూ 100కుపైగా ప్రైవేటు ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ జీవోలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం వెకేట్ స్టే పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లు అన్నింటిపై జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం గురువారం దాదాపు ఐదు గంటలపాటు విచారణ కొనసాగించింది. ప్రైవేటు కాలేజీల తరఫున సీనియర్ న్యాయవాదులు ఎస్ శ్రీరామ్, ఎల్ రవిచందర్, అవినాశ్ దేశాయ్, తరణ్ జీ రెడ్డి, స్రింగారపు సాహిల్‌రెడ్డి తదితరులు వాదించారు. ‘విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు చెప్పిన తర్వాత.. ఆ ఉత్తర్వులను ధిక్కరించేలా ప్రత్యామ్నాయ జీవోలు తెచ్చారు. వాటిపై కూడా స్టే ఇవ్వడంతో ప్రస్తుతం వెకేట్ స్టే పిటిషన్ ద్వారా దిగివచ్చారు. ఇదంతా చేసిన ప్రభుత్వంపై నమ్మకం ఎలా ఉంటుంది. తొలిదశగా కనీం రూ.1500 కోట్లు విడుదల చేయలేరా? దాదాపు రూ.10 వేల కోట్లు పాత బకాయిలు ఉన్నాయి. కాలేజీలు ఎలా నడపాలి. జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నాం. విద్యార్థులు కాలేజీల నుంచి వెళ్లిపోయారు. ఆ ఫీజులు ఎలా వసూలు చేసుకోవాలి?’ అని ప్రశ్నించారు. ఆగస్టు 27 వరకు చివరి అడ్మిషన్లకు అవకాశం ఉందని, ఆగస్టు 15లోపు ప్రభుత్వం చెల్లిస్తే.. ఆ తర్వాత విద్యార్థులు కోర్సుల్లో చేరొచ్చని తెలిపారు.
విద్యార్థులు ఇబ్బంది పడొద్దనే ఆ జీవోలు
రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పమిడిఘంటం శ్రీ రఘురాం, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి వాదనలు వినించారు. ‘రూ.10 వేల కోట్లు పాత బకాయిలు ఉన్నాయని ఎవరు నిర్ధారించారు? అది వెయ్యి కోట్లే కావొచ్చు. ప్రస్తుతం రూ.250 కోట్లు ఎస్ర్కో ఖాతాలో ఉంచుతున్నాం. ఈ నిధులను విడుదల చేస్తున్నాం. మరో వెయ్యి కోట్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆగస్టు 15 నాటికి ఫస్టియర్ ఫీజులు, ఈనెల చివరలో ఇతర సంవత్సరాల విద్యార్థుల ఫీజులు ఇస్తాం. అడ్మిషన్ల సమయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఇబ్బందులు పడొద్దన్నది ప్రభుత్వం ఆందోళన. ఫీజు చెల్లిస్తేనే అడ్మిషన్ ఇస్తామని ప్రైవేటు కాలేజీలు చెబితే.. పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది. ఈ మేరకు ఫీజుల జీవోలపై విధించిన మధ్యంతర స్టేను సడలించి విద్యార్థులకు ఉపశమనం కల్పించాలి’ అని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.