Share News

పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే మేమే తరలిస్తాం

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:03 AM

పొలాల్లోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌(డీటీఆర్‌) మరమ్మతుకు గురైతే డిస్కమ్‌ వాటిని స్పెషల్‌ మెయింటెనెన్స్‌ షెడ్‌(ఎ్‌సపీఎం)కు తరలిస్తుందని విద్యుత్‌ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి.

పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్లు పాడైతే మేమే తరలిస్తాం

  • అదే రైతులు తరలిస్తే రవాణా చార్జీలు చెల్లిస్తాం

  • విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రకటన

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): పొలాల్లోని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌(డీటీఆర్‌) మరమ్మతుకు గురైతే డిస్కమ్‌ వాటిని స్పెషల్‌ మెయింటెనెన్స్‌ షెడ్‌(ఎ్‌సపీఎం)కు తరలిస్తుందని విద్యుత్‌ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి. ఒక వేళ రైతులే ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎస్‌పీఎంకు తీసుకువస్తే వారికి రవాణా చార్జీలు చెల్లిస్తామని ప్రకటించాయి. రవాణా చార్జీల కింద మండలం లోపల అయితే రూ.750, మండలం బయట అయితే రూ.1000 చెల్లిస్తామని వెల్లడించాయి. ట్రాన్స్‌ఫార్మర్‌ లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు రైతులు ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. ఆయా పనులకు సిబ్బంది ఎవరైనా డబ్బు డిమాండ్‌ చేస్తే సంబంధిత ఎస్‌పీఎం కేంద్రాల్లో ఉన్న ఫోన్‌ నెంబర్‌లలో అధికారులకు ఫోన్‌ చేసి, సమాచారం ఇవ్వాలని సూచించాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను విద్యుత్‌ సంస్థలు దాఖలు చేసిన ఏఆర్‌ఆర్‌, టారిఫ్‌ ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) అభ్యంతరాలు కోరగా పలువురు స్పందించారు. సిద్దిపేటకు చెందిన కె.జశ్వంత్‌రెడ్డి రైతుల డీటీఆర్‌లపై పలు అంశాలు లేవనెత్తారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ కోసం డీడీలు కట్టినా కనెక్షన్‌లు ఇవ్వడం లేదని, కనెక్షన్‌ ఇవ్వడానికి కాలపరిమితి ఉందా.? అని ప్రశ్నించగా... ఎవరు తొలుత దరఖాస్తు చేసుకుంటే వారికే తొలుత కనెక్షన్‌ ఇస్తామని డిస్కమ్‌ బదులు ఇచ్చింది. ట్రాన్స్‌ఫార్మర్‌ దిమ్మెకు రూ.15 వేలు, స్తంభాలు మెటీరియల్‌ కోసం రూ.5 వేలు, లేబర్‌ ఖర్చు కోసం రూ.10 వేలు కలుపుకొని రూ.30వేలు విద్యుత్‌ అధికారులకు ఇచ్చానని మిర్యాలగూడకు చెందిన కొంతం లింగారెడ్డి ఫిర్యాదు చేయగా.. వివరాలను అందజేయాలని డిస్కమ్‌ బదులిచ్చింది. ఇక, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయం చేస్తున్న వారు వ్యవసాయ భూమి పక్కనే ఇళ్లు కట్టుకోవడం వల్ల... కమర్షియల్‌ కనెక్షన్‌ తీసుకోవాలని అధికారులు చెబుతున్నారని, కరెంట్‌ కనెక్షన్‌ ఇవ్వకపోతే పట్టణ రైతులు వ్యవసాయం చేయాలా ? వద్దా ? అని సిద్దిపేటలోని గడిచర్లపల్లికి చెందిన పూసల నగేష్‌ ప్రశ్నించారు. అయితే, వ్యవసాయ భూమి రికార్డుల్లో మార్పిడి జరుగకపోతే వ్యవసాయ కనెక్షన్‌ ఇవ్వడానికి అర్హత ఉంటుందని డిస్కమ్‌ గుర్తు చేసింది. ఇక, 2026-27 ఆర్థిక సంవత్సరం ఏఆర్‌ఆర్‌తో పాటు 2022-23, 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలు విద్యుత్‌ కొనుగోళ్ల ట్రూ-అప్‌ కోసం వేసిన పిటిషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేసే గడువును తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటల దాకా పొడిగించింది.

Updated Date - Feb 13 , 2026 | 06:03 AM