Share News

రైతులకు ఎకరాకు 600 గజాల చొప్పున..

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:42 AM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడ ప్రాంతంలో బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌కు 400 ఎకరాలు, బస్‌ టెర్మినల్‌కు 100 ఎకరాలు, మెట్రో రైలు ప్రాజెక్టుకు 50 ఎకరాలు...

రైతులకు ఎకరాకు 600 గజాల చొప్పున..

  • బహదూర్‌గూడలో 96 ఎకరాల్లో అభివృద్ధిచేసే లే అవుట్‌లో కేటాయించేందుకు నిర్ణయం

  • రైతులతో కొనసాగుతున్న ప్రభుత్వం చర్చలు

  • 650 ఎకరాల్లో బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌కు 400 ఎకరాలు

  • బస్‌ టెర్మినల్‌కు 100, మెట్రో టెర్మినల్‌కు 50 ఎకరాలు

  • బహదూర్‌గూడ దాడి ఘటనలో కేసులు నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం బహదూర్‌గూడ ప్రాంతంలో బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌కు 400 ఎకరాలు, బస్‌ టెర్మినల్‌కు 100 ఎకరాలు, మెట్రో రైలు ప్రాజెక్టుకు 50 ఎకరాలు కేటాయించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. భూములు ఇచ్చిన రైతుల పునరావాసం కోసం 96 ఎకరాలు కేటాయించారు. ఈ 96 ఎకరాల్లో లే అవుట్‌ అభివృద్ధి చేసి.. రైతులకు ఎకరాకు 600 గజాల వంతున కేటాయించనున్నారు. ఇతర ప్రభుత్వ అవసరాల కోసం 4 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్న బహదూర్‌గూడలోని 650 ఎకరాలను బుల్లెట్‌ ట్రైన్‌ హబ్‌తో పాటు బస్‌, మెట్రో రైల్‌ టెర్మినళ్ల కోసం కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 650 ఎకరాల ప్రభుత్వ భూములకు శనివారం ఫెన్సింగ్‌ వేసింది. ఈ భూములను కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు అధికారులను అడ్డుకుని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కళ్లల్లో కారం చల్లి కుర్చీలు విసిరి వేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇక్కడ ఇంకా పోలీస్‌ పికెట్‌ కొనసాగుతోంది. మరోవైపు రైతులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తోంది.

బహదూర్‌గూడ దాడి ఘటనలో కేసులు నమోదు

శంషాబాద్‌ రూరల్‌: బహదూర్‌గూడ వ్యవహారంలో శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో పలువురిపై ఆదివారం కేసులు నమోదయ్యాయి. చేవెళ్ల డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని సర్వే నంబర్లు 28, 62లో హైడ్రా, రెవెన్యూ అధికారులు 650 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె నిర్మిస్తుండగా కొందరు రైతులు, రాజకీయ నాయకులు అడ్డుకున్నారు. కొందరు మహిళలు పోలీసుల కళ్లలో కారం చల్లి, రాళ్లు, కుర్చీలతో దాడి చేశారు. దీంతో ముడావత్‌ నీలమ్మ, పామెన గాయత్రి, ఎల్గని జ్యోతి, జటావత్‌ కబ్లీతో తదితర ఏడుగురు మహిళలపై కేసులు నమోదు చేశారు. మరి కొంతమంది రాజకీయ నాయకులపై కూడా కేసులు పెట్టారు. దాడి ఘటనలో వీడియోలు పరిశీలించి ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలిపారు.

Updated Date - Jul 20 , 2026 | 03:42 AM