పురుగుల మందు తాగి ఇద్దరు రైతుల బలవన్మరణం
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:13 AM
కొనుగోలు కేంద్రంలో జొన్నలను లారీలకు ఎత్తేందుకు సిబ్బందికి అదనంగా చెల్లించలేక, రోజుల తరబడి నిరీక్షించలేక మనస్తాపంతో ఓ రైతు...
జొన్న కొనుగోలు కేంద్రంలో అదనంగా చెల్లించలేక ఒకరు
అప్పుల బాధ తాళలేక మరొకరు..
సిరికొండ, బీమారంజూన్ 16 (ఆంధ్రజ్యోతి) : కొనుగోలు కేంద్రంలో జొన్నలను లారీలకు ఎత్తేందుకు సిబ్బందికి అదనంగా చెల్లించలేక, రోజుల తరబడి నిరీక్షించలేక మనస్తాపంతో ఓ రైతు... కుమార్తె పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక మరో అన్నదాత పురుగుల మందు తాగి ఉసురు తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు నుగూరే పాండురంగ్(48) ఈనెల 6వ తేదీన జొన్నలను విక్రయించేందుకు సిరికొండ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. వాటిని విక్రయించిన అనంతరం హమాలీలకు కూలీ చెల్లించాడు. తూకం వేసిన జొన్నలను లారీల్లో లోడ్ చేసేందుకు అదనంగా డబ్బులు చెల్లించాలని కొనుగోలు కేంద్రం సిబ్బంది కోరినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. తన వద్ద లోడింగ్ ఖర్చులకు డబ్బులు లేవని రైతు వాపోయినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. పదిరోజులుగా నిరీక్షించినా, పలుమార్లు అధికారులకు విన్నవించినా స్పందన రాలేదని తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన పాండురంగ్ మంగళవారం పురుగుల మందు తాగాడు. స్థానికులు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరోఘటనలో.. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన రైతు రావుల భిక్షపతి(59) మూడెకరాల్లో వ్యవసాయం చేస్తున్నాడు. 2023లో కుమార్తె వివాహం కోసం హసన్‌పర్తిలో రూ.8లక్షల వరకు అప్పులు చేశాడు. అవి తీర్చే దారి లేక కొద్ది రోజులుగా మధనపడుతున్నాడు. సోమవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందును తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు.