Share News

3-4 ఎకరాలున్న రైతుల ఖాతాల్లో ఒకే రోజు రూ.1330.32 కోట్లు జమ: తుమ్మల

ABN , Publish Date - Jul 03 , 2026 | 06:41 AM

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద మూడో విడతలో 3 నుంచి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో..

3-4 ఎకరాలున్న రైతుల ఖాతాల్లో ఒకే రోజు రూ.1330.32 కోట్లు జమ: తుమ్మల

  • ఇప్పటిదాకా 61.35 లక్షల మంది రైతులకు 5402.37 కోట్ల రైతు భరోసా సాయం

  • 14 పీఏసీఎస్‌లకు ప్రత్యామ్నాయ కమిటీలు

  • సహకార సంఘాలకు పీఐసీల నియామకం

  • రైతులకు సేవల్లో అంతరాయం లేకుండా చూసేందుకు ఈ కమిటీలు: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుభరోసా పథకం కింద మూడో విడతలో 3 నుంచి 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో గురువారం రూ. 1330.32 కోట్లను నేరుగా జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతులు 22.17 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించిన రైతు భరోసా సాయాన్ని పొందారని మంత్రి తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విడతల వారీగా రైతుభరోసా నిధులను విడుదల చేస్తున్నామని, ఇప్పటికే మొదటి రెండు దశల్లో 3 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు నిధులు విడుదల చేశామని మంత్రి తుమ్మల వివరించారు. ఇప్పటివరకు రైతుభరోసా పథకం కింద మొత్తం 61.35 లక్షల మంది రైతులకు 90.04 లక్షల ఎకరాల సాగుభూమికి సంబంధించి రూ. 5402.37 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలోని 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్‌) ప్రత్యామ్నాయ నాన్‌-అఫీషియల్‌ పర్సన్‌-ఇన్‌చార్జి (పీఐసీ) కమిటీలను నియమించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.


తెలంగాణ సహకార సంఘాల చట్టం ప్రకారం ఈ కమిటీలను ఆరు నెలలపాటు లేదా ఆయా సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు లేదా ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఏది ముందు అయితే అది వర్తించే విధంగా నియమించినట్లు వెల్లడించారు. సహకార సంఘాల ప్రత్యేక కమిషనర్‌, రిజిస్ట్రార్‌ ఆయా సహకార సంఘాల పనితీరును సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. సంఘాల్లో రుణాల వసూళ్లలో తీవ్ర జాప్యం, ఎగవేతదారుల జాబితా తయారు చేయకపోవడం, ఆడిట్‌ అభ్యంతరాలను సరిదిద్దకపోవడం, నిర్వహణ కమిటీ సభ్యులు సమావేశాలకు హాజరుకాకపోవడం, పరిపాలనా లోపాలు, సహకార సంఘాల ప్రధాన లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలో తెలిపారు. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత కమిటీలు కొనసాగితే సహకార రుణ వ్యవస్థ లక్ష్యాల అమలు దెబ్బతింటుందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిందని మంత్రి తుమ్మల అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్‌ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ప్రక్రియ పూర్తవకుండా ఎన్నికలు నిర్వహించడం కుదరదు. అయితే, రైతులకు అందించే సేవల్లో అంతరాయం లేకుండా చూసేందుకే పీఐసీలను నియమించినట్లు మంత్రి తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలోని మానకొండూరు, తాడికల్‌, మెట్‌పల్లి; వరంగల్‌ జిల్లాలోని అమీనాబాద్‌, ఖానాపూర్‌, మహ్మదాపూర్‌, మందపల్లి, సూరిపల్లి, రెడ్లవాడ, చెన్నరావుపేట, గురిజాల, నర్సంపేట; వికారాబాద్‌ జిల్లాలో కుల్కచర్ల, పరిగి పీఏసీఎస్‌లకు పీఐసీలను నియమించారు. ఈ కమిటీలు ఆయా పీఏసీఎస్‌ల నిర్వహణను పర్యవేక్షిస్తాయని తుమ్మల చెప్పారు.

Updated Date - Jul 03 , 2026 | 06:44 AM