ఎరువుల భారాన్ని తగ్గించండి : రైతు సంఘం
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:39 AM
వ్యవసాయ సీజన్ మొదలవడంతో.. రైతులపై ఎరువుల భారం అధికంగా ఉందని, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది.
జూన్ 6, 8 తేదీల్లో ఆందోళనలకు పిలుపు
హైదరాబాద్, జూన్ 3 (ఆంధ్ర జ్యోతి) : వ్యవసాయ సీజన్ మొదలవడంతో.. రైతులపై ఎరువుల భారం అధికంగా ఉందని, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం డిమాండ్ చేసింది. పెంచిన ధరలను నిరసిస్తూ ఈ నెల 6, 8 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించాలని రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాగం హేమంతరావు, పశ్య పద్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 50 కిలోల ఎరువుల బస్తా ధరలు విపరీతంగా పెంచారని పేర్కొన్నారు. పెంచిన ఎరువుల ధరలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం యూరియా యాప్‌ను రద్దు చేయాలని, రైతు భరోసా ఏకకాలంలో అమలు చేయాలని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని, నకిలీ విత్తనాలు, పురుగుమందులు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని, రూ.2 లక్షలలోపు రుణాలను మాఫీ చేయాలని, సమగ్ర భూ సర్వే చేసి.. భూభారతి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ఈ డిమాండ్లతో తహశీల్దార్ల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు.