కొనుగోళ్ల జాప్యం.. రైతన్న రౌద్రం!
ABN , Publish Date - May 26 , 2026 | 04:30 AM
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు సోమవారం ఆందోళనకు దిగారు. నిర్మల్, మంచిర్యాల, నల్లగొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు మండలాల్లో రైతులు...
పలు చోట్ల రోడ్డెక్కిన అన్నదాతలు .. జాతీయ రహదారుల దిగ్బంధం .. అధికారుల తీరుపై నిరసనలు
కడెం, భీమారం, కట్టంగూరు, చింతపల్లి, సంగారెడ్డి, మే 25 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు సోమవారం ఆందోళనకు దిగారు. నిర్మల్, మంచిర్యాల, నల్లగొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోని పలు మండలాల్లో రైతులు రోడ్డెక్కారు. రాస్తారోకోలు, ధర్నాలతో జాతీయ రహదారులను దిగ్బంధించారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం కలిమెరలో రోడ్డుపై ధాన్యాన్ని పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని రోజుల తరబడి తూకం వేయడం లేదని, కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదని, అధికారులు-మిల్లర్లు కుమ్మక్కై తూకంలో కోత పెడుతున్నారని ఈ సందర్భంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ చౌరస్తా వద్ద లింగాపూర్, సారంగాపూర్, మాసాయిపేట్ గ్రామాల రైతులు నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఎండ వేడిమితో రైతు నర్సయ్య స్పృహ కోల్పోగా రైతులు ఆయనను కడెం ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడుతున్న ఆర్‌ఐ శారద కాళ్ల మీద పడిన రైతులు.. ధాన్యం లారీలు పంపించాలని ప్రాధేయపడ్డారు. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలు రాకపోవడం, అధికారులు ధాన్యాన్ని తూకం వేయకపోవడం, తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో రైతులు జాతీయ రహదారి వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే రోజుల తరబడి కొనుగోలు చేయడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులు- మిల్లర్లు కుమ్మక్కై బస్తాకు 5 కిలోల ధాన్యాన్ని కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కన్నాల ప్లై ఓవర్ బ్రిడ్జిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. అధికారులు రైతుల వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనలను విరమించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, సిద్దిపేట అర్బన్, హుస్నాబాద్ మండలాలకు చెందిన రైతులు జాతీయ రహదారులపై ధర్నాకు దిగారు. నంగునూరు మండల కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. తొగుట మండలం పెద్దామాసాన్‌పల్లి రైతులు వడ్లను ట్రాక్టర్‌లో కలెక్టరేట్ ఎదుట నిరసనకు తెలిపేందుకు వెళ్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్‌కు చెందిన రైతులు సోమవారం పీఏసీఎస్ కార్యాలయంలో అధికారులను నిలదీశారు.
ధాన్యానికి నిప్పు పెట్టి నిరసన
నల్లగొండ జిల్లా కలిమెరలో రైతులు రోడ్డుపై ధాన్యాన్ని పోసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు చేసిన తర్వాత ధాన్యాన్ని లారీల్లోకి ఎత్తేందుకు డ్రైవర్లు బస్తాకు రూ.10 వరకు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో తేమ సాకుతో తమను ఇబ్బంది పెట్టొద్దంటూ నల్లగొండ జిల్లా చింతపల్లిలో హైదరాబాద్ రహదారిపై అన్నదాతలు బైఠాయించారు. దీంతో గంటపాటు వాహనాల రాకోపోకలు నిలిచిపోయాయి.