కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:15 AM
కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒరిగేదేమీలేదని, రైతులకు తీవ్ర నిరాశ కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు...
ఎన్నిసార్లు కేంద్రాన్ని కోరినా ఆయిల్‌పామ్‌పై
దిగుమతి సుంకం పెంచని కేంద్ర ప్రభుత్వం
పసుపు బోర్డుకు నిధుల కేటాయింపు లేదు
రైతాంగానికి బడ్జెట్ తీవ్ర నిరాశ మిగిల్చింది
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒరిగేదేమీలేదని, రైతులకు తీవ్ర నిరాశ కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆయిల్‌పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. దీంతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగుచేస్తున్న రైతులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించకుండా... దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. ‘పసుపు బోర్డు ఏర్పాటుకు నిధులు కేటాయించలేదు. పసుపును అధిక విలువైన పంటగా గుర్తించలేదు. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్ గురించి బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చింద’ని పేర్కొన్నారు. కొబ్బరి బోర్డు ఏర్పాటుపైనా ఎలాంటి ప్రకటనా లేదన్నారు.ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో కేంద్రం రైతులపై మరింత భారం మోపనుందని తెలిపారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హక్కు కల్పించడంలో కేంద్రం మరోసారి విఫలమైందని విమర్శించారు. దీంతో రైతుల ఆదాయ భద్రతపై అనిశ్చితి మరింత పెరిగిందన్నారు. వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపై స్పష్టమైన దిశా నిర్దేశం లేకపోవడం కేంద్ర బడెట్‌లో ప్రధాన లోపమని చెప్పారు. దేశీయ నూనెగింజల రైతులను రక్షించేలా నూనెలపై దిగుమతి సుంకంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కేంద్ర పథకాల ఏకీకరణ పేరుతో తెలంగాణకు వచ్చే నిధుల్లో కోత విధించడం రాష్ట్రానికి తీరని అన్యాయమని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యం ఇప్పటికీ మాటలకే పరిమితమైందని, దానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యవసాయరంగంలో బడ్జెట్‌లో ప్రస్తావించదగిన ఏకైక అంశం ఏఐ ఆధారిత కార్యక్రమాల ప్రస్తావన మాత్రమేనని, ధరల భద్రత, మార్కెట్ భరోసా లేకుండా కేవలం ఏఐతో రైతు సమస్యలకు పరిష్కారం కాదని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ రాష్ట్ర రైతాంగాన్ని నిరాశపరచిందని, రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం లేకుండా రూపొందించారని తుమ్మల పేర్కొన్నారు.