Share News

రైతులు.. ఇక మార్కెట్‌ దయాదాక్షిణ్యాలపై!

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:23 AM

కేంద్రం ఎంత కోటాను ఇస్తే అంత మేరకే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

రైతులు.. ఇక మార్కెట్‌ దయాదాక్షిణ్యాలపై!

  • కేంద్రం కోటా మేరకే పంట ఉత్పత్తులు కొంటామన్న ప్రభుత్వ నిర్ణయంపై ఆందోళన

  • అత్యధిక సాగు ఉత్పత్తులను బహిరంగ మార్కెట్‌లోనే విక్రయించాల్సిన పరిస్థితి

  • వరి, మొక్కజొన్న, కందులు, సోయాబీన్‌ రైతులపై తీవ్ర ప్రభావం

  • ప్రస్తుతం 25 శాతమే కొంటున్న కేంద్రం

  • రాష్ట్రం కొనుగోళ్లతో రైతులకు ఇంత కాలం భరోసా.. అది లేకపోతే కష్టకాలమే

  • మార్క్‌ఫెడ్‌ ద్వారా ధాన్యం కొని ఎగుమతులు చేయవచ్చు: నిపుణులు

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ఎంత కోటాను ఇస్తే అంత మేరకే వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, కందులు, జొన్న, సజ్జలు, సోయాబీన్‌ తదితర పంటలు పెద్దఎత్తున పండుతున్నాయి. కేంద్రం మాత్రం తెలంగాణలో పండిస్తున్న పంటల్లో 25 శాతమే సేకరిస్తోంది. వాటికి మాత్రమే కనీస మద్ధతు ధర మేర డబ్బులు చెల్లిస్తోంది. మిగిలిన 75 శాతం పంట ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వం కొంత, మార్కెట్‌ వర్గాలు మరికొంత కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే కేంద్రం కోటా పోనూ మిగిలిన పంట ఉత్పత్తులన్నింటినీ మార్కెట్‌ వర్గాలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలాగైతే రైతులకు మద్ధతు ధర పూర్తిస్థాయిలో దక్కుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి కేంద్రం కొనుగోలు కోటాను కొంత పెంచగలిగితే రైతులకు ఉపశమనం కలుగుతుంది. కేంద్రం ససేమిరా అంటే మాత్రం రైతులు పూర్తిగా మార్కెట్‌పైనే ఆధారపడాల్సి వస్తుంది. మార్కెట్‌లో ధర ఉంటే ఇబ్బంది లేదు కానీ అందుకు భిన్నంగా ఉంటే మాత్రం అన్నదాతలకు తిప్పలు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రధానంగా వరి, మొక్కజొన్న, జొన్న, సోయాబీన్‌, కందులు, పొద్దు తిరుగుడు పంటలపై తీవ్ర ప్రభావం చూపనుంది.


146.89 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం

రాష్ట్రంలో వానాకాలంలో కోటి 20 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయి. వీటిలో అధికంగా వరి, మొక్కజొన్న, పత్తి ఉండగా.. ఇతర పంటల్లో శనగ, జొన్న, పసుపు, సోయాబీన్‌, మిర్చి ఉంటున్నాయి. పత్తిని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) కొనుగోలు చేస్తుండగా, మిర్చి కొనుగోళ్లు పూర్తిగా మార్కెట్‌లోనే జరుగుతున్నాయి. వరి విషయంలో కేంద్రం ఏటా సీజన్‌కు ముందుగానే ఎంత శాతం సేకరిస్తాం అనేది ప్రకటిస్తుంది. మిగిలిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఉదాహరణకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో 146.89 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండింది. దీంట్లో కేంద్రం 52 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవటానికి ముందుకొచ్చింది. మిగిలిన 94.89 లక్షల మెట్రిక్‌ టన్నులను రాష్ట్ర ప్రభుత్వం, మార్కెట్‌ కొనుగోలు చేస్తున్నాయి. అంటే, పండిన ధాన్యంలో దాదాపు మూడోవంతు మాత్రమే కేంద్రం కొనుగోలు చేస్తోంది. ఇక మీదట కేంద్రం కోటా మేరకే కొంటే.. మిగిలిన రెండొంతుల ఽధాన్యాన్ని మార్కెట్‌లోనే రైతులు అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇక మరో ప్రధాన పంట అయిన మొక్కజొన్నకు కేంద్రం మద్ధతు ధరను ప్రకటిస్తుంది తప్ప కొనుగోలు చేయదు. రాష్ట్ర ప్రభుత్వమే మార్క్‌ఫెడ్‌ ద్వారా కొంటోంది. 2025-26 యాసంగిలో రాష్ట్రంలో 2 లక్షల మెట్రిక్‌ టన్నుల జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. ఈసారి రాష్ట్రంలో 4 లక్షల మెట్రిక్‌ టన్నుల జొన్నలు ఉత్పత్తి అయ్యాయి. వీటిలో ఎంతవరకు తీసుకుంటుందో తెలియదు. పొద్దుతిరుగుడు పంటకు కేంద్రం 25 శాతం కొనుగోలుకు అనుమతినిచ్చింది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 1,175 మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది. తాజా నిర్ణయంతో ఇలా అదనంగా కొనే పరిస్థితి ఉండదు. రైతులు పూర్తిగా మార్కెట్‌ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడే పరిస్థితి నెలకొంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


మార్కెట్‌లే దిక్కు.. దళారులదే రాజ్యం..

రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో కేంద్రం కోటా మేరకు విక్రయిస్తే.. మిగిలిన పంటను ఎలా అమ్ముకోవాలి? బహిరంగ మార్కెట్‌లో మద్ధతుధర లభిస్తుందా? అన్న ప్రశ్నలు రైతుల్లో ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం మద్ధతు ధర ఇచ్చి కొంటున్న సమయంలోనే.. మార్కెట్‌లో ప్రైవేటు వ్యాపారులు ధరలను తగ్గించి కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మీదట అత్యధికం పంట ఉత్పత్తులను మార్కెట్‌కే తరలించాల్సి వస్తే.. ప్రైవేటు వ్యాపారులు, దళారులు చెప్పిందే ధర అన్నట్టుగా పరిస్థితులు మారుతాయని, దాంతో రైతులు తీవ్రంగా నష్టపోతారని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో సాగైన పంట ఉత్పత్తుల విక్రయాలను మార్క్‌ఫెడ్‌ ద్వారా జరిపే అవకాశం ఉన్నా కూడా ఆ దిశగా ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా ప్రస్తుతం మొక్కజొన్న, పెసలు, కందులు, సోయాబీన్‌ మొదలైన పంటలను కొంటున్నారు. ఇదే తరహాలో వరిని కూడా కొనుగోలు చేయొచ్చని, కేంద్రం తీసుకోగా మిగిలిన పంటను కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఇతర దేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరి సాగును తగ్గించటంలో భాగంగానే!

దేశంలో వరి సాగు భారీగా పెరిగిపోయిందని, బియ్యం నిల్వకు.. ఉన్న గిడ్డంగులు సరిపోవటం లేదని.. వరి సాగును తగ్గించాలని కేంద్రం గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతోంది. గత బీఆర్‌ఎస్‌ హయాంలోనూ వరిని తగ్గించాలంటూ రైతులకు ప్రభుత్వం సూచించింది. అయినప్పటికీ, వరి సాగు రాష్ట్రంలో తగ్గకపోగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే, వరి సాగును తగ్గించటంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.


ప్రభుత్వ నిర్ణయం అతిపెద్ద తప్పు

కేంద్రం కోటా మేరకే పంట కొనుగోళ్లు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించటం అతి పెద్ద తప్పు. ప్రస్తుతం తెలంగాణ నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు బంగ్లాదేశ్‌, మలేషియా, శ్రీలంక తదితర దేశాలకు ఏటా 35 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం ఎగుమతి చేస్తున్నారు. ఇదే తరహాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి, బియ్యంగా మార్చి కేంద్రం అనుమతితో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తే ప్రభుత్వానికి లాభం రాకపోయినా నష్టమైతే రాదు. కర్ణాటక ప్రభుత్వం వరిని మార్క్‌ఫెడ్‌ ద్వారానే కొంటోంది. పంటల కొనుగోళ్ల విషయంలో క్యాబినెట్‌ ఈ నిర్ణయం తీసుకునే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తే ప్రత్యామ్నాయ సూచనలు లభించి ఉండేవి. ప్రభుత్వం నిర్ణయం ప్రైవేటు వ్యాపారులు, దళారులకు లాభం చేకూరుస్తుంది. రైతులకు తీవ్ర నష్టం చేస్తుంది.

- సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నాయకులు

Updated Date - Jun 19 , 2026 | 03:23 AM