మొక్కజొన్న డబ్బులు వచ్చేదెప్పుడు?
ABN , Publish Date - May 23 , 2026 | 04:46 AM
మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్క జొన్నలు విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.
నెల రోజులుగా ఆందోళనలో రైతులు
పెద్దపల్లి, మే 22 (ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మొక్క జొన్నలు విక్రయించిన రైతులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. నెల రోజులు గడుస్తున్నా.. రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్నల కొనుగోళ్ల కోసం ప్రభుత్వం రూ.4,172కోట్లు కేటాయించినప్పటికీ, రాష్ట్రంలోని ఏ ఒక్క రైతుకూ డబ్బులు చెల్లించలేదు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 11,21,494 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగుచేయగా.. 29.79 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ, ఈ సారి వాతావరణం అనుకూలించడంతో దాదాపుగా 35.88లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 336 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇప్పటివరకు సుమారుగా 12లక్షల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. క్వింటాల్‌కు రూ.2,400 చొప్పున రూ.2,880 కోట్లను రైతులకు చెల్లించాల్సి ఉంది. ఏటా మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించిన రైతులకు వారం, పదిరోజుల్లోనే డబ్బులు చెల్లించే వారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి నెల రోజులు దాటినా డబ్బులు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సత్వరమే ప్రభుత్వం స్పందించి తమ ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని రైతులు కోరుతున్నారు.