రైతు డిస్కమ్‌కు సిబ్బంది నియామకం
ABN , Publish Date - Mar 18 , 2026 | 04:47 AM
తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీజీఆర్‌పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయానికి సిబ్బందిని సమకూర్చే ప్రక్రియ ముందుకు కదిలింది.
ఉత్తర, దక్షిణ డిస్కమ్‌ల నుంచి డిప్యూటేషన్‌పై సర్దుబాటు
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (టీజీఆర్‌పీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయానికి సిబ్బందిని సమకూర్చే ప్రక్రియ ముందుకు కదిలింది. ఈ టీజీఆర్‌పీడీసీఎల్ ఇప్పటికే సీఎండీతో పాటు డైరెక్టర్లను సమకూర్చగా... తాజాగా నలుగురు చీఫ్ ఇంజనీర్లు (సీఈ), ముగ్గురు ఎస్‌ఈలు, ఆరుగురు డీఈలు, 10 మంది ఏడీఈలు, 16 మంది దాకా ఏఈలు, ఒక సబ్ ఇంజనీర్, ఫైనాన్స్ విభాగానికి 16 మంది సిబ్బందితో పాటు హెచ్‌ఆర్‌లో 5గురు ఉద్యోగులను దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్), ఉత్తర డిస్కమ్ (టీజీఎన్పీడీసీఎల్) నుంచి సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వీరంతా డిప్యూటేషన్‌పై ఈ డిస్కమ్‌లో విధులు నిర్వర్తించనున్నారు. వాస్తవానికి ఇప్పటిదాకా ఉన్న రెండు డిస్కమ్‌లు(ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్)లు ఒకే ప్రాంతానికి పరిమితం కాగా... టీజీఆర్‌పీడీసీఎల్ రాష్ట్రస్థాయి డిస్కమ్‌గా మనుగడ సాగించనుంది. త్వరలోనే తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) రైతు డిస్కమ్ వ్యాపారం చేసుకోవడానికి లైసెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈఆర్‌సీ లైసెన్స్ జారీ అనంతరం కొత్త డిస్కమ్ మనుగడలోకి రానుంది.