ధాన్యం ఆరబెడుతూ వడదెబ్బతో రైతు మృతి
ABN , Publish Date - May 09 , 2026 | 06:22 AM
ధాన్యం ఆరబెడుతూ వడదెబ్బకు గురైన ఓ రైతు మృతి చెందారు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.
స్టేషన్‌ఘన్‌పూర్, మే 8 (ఆంధ్రజ్యోతి): ధాన్యం ఆరబెడుతూ వడదెబ్బకు గురైన ఓ రైతు మృతి చెందారు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మునిసిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. రైతు గాండ్ల రవి (47) తాను పండించిన ధాన్యాన్ని అదే గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రానికి తరలించారు. శుక్రవారం ఉదయం 8 నుంచి 11గంటల వరకు భార్య జ్యోతితో కలిసి తీవ్రమైన ఎండలో ధాన్యం శుద్ధి (పాడి డ్రయర్ ద్వారా) పనుల్లో నిమగ్నమయ్యారు. ఎండలో శ్రమించి ఇంటికి చేరుకున్న రవి, స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. రెండు సార్లు వాంతులు చేసుకుని అపస్మారక స్థితికిలోకి వెళ్లడంతో, ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు.