Share News

ఆనకట్టల రక్షణ పథకం అమలులో నిర్లక్ష్యం

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:58 AM

వరదల నుంచి ప్రాజెక్టుల ఆనకట్టలను రక్షించుకునేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు ప్రపంచ బ్యాంకు తక్కువ వడ్డీతో రుణం రూపంలో నిధులు ఇస్తున్నా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోంది.

ఆనకట్టల రక్షణ పథకం అమలులో నిర్లక్ష్యం

  • ప్రపంచ బ్యాంకు నిధులతో డ్రిప్‌ పథకం

  • రాష్ట్రంలో తగిన యంత్రాంగం లేక.. పథకం అమలులో వెనకబాటు

  • డ్రిప్‌-2లో 100 కోట్లు కేటాయించిన కేంద్రం

  • 5.72 కోట్లకే ప్రతిపాదనలు.. ఆమోదం

  • తక్కువ వడ్డీతో రుణం లభిస్తున్నా..వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): వరదల నుంచి ప్రాజెక్టుల ఆనకట్టలను రక్షించుకునేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు ప్రపంచ బ్యాంకు తక్కువ వడ్డీతో రుణం రూపంలో నిధులు ఇస్తున్నా.. వాటిని రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోంది. ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డ్యామ్‌ రిహాబిలిటేషన్‌ ఇంప్లిమెంటేషన్‌ ప్రాజెక్టు (డ్రిప్‌)ను రాష్ట్రంలో సరిగా అమలు చేయలేకపోతోంది. కేంద్రం నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నా.. అమలు యంత్రాంగం లేకపోవడం శాపంగా మారింది. డ్రిప్‌ పథకం కోసం ప్రత్యేకంగా నివేదికలు సిద్ధం చేయడానికి, ఆ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్రంలో ప్రత్యేక విభాగం లేకపోవడం, పూర్తిస్థాయి యంత్రాంగం లేకపోవడమే రాష్ట్రం వెనకబాటుకు కారణమని కేంద్రం గుర్తించింది. డ్రిప్‌ రెండో దశలో రూ.100 కోట్లు, మూడో దశలో రూ.445 కోట్లను తెలంగాణకు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే రెండో దశలో కేవలం 9 డ్యామ్‌ల ప్రతిపాదనలు మాత్రమే కేంద్రానికి చేరగా.. కేవలం రూ.5.72 కోట్ల పనులకే కేంద్రం సమ్మతి తెలిపింది. పనుల విషయానికి వస్తే.. ఒక్క పనిని కూడా ఈ పథకం కింద కాంట్రాక్టర్లకు అప్పగించకపోవడం గమనార్హం. వాస్తవానికి 2024లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 29 ప్రాజెక్టులకు రూ.645 కోట్లను డ్రిప్‌ కింద వెచ్చించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లోని 736 డ్యామ్‌లను ఈ ప్రాజెక్టులోకి చేర్చిన కేంద్రం.. దీనికి రూ.10,211 కోట్లు అవుతాయని ఇదివరకు అంచనా వేసింది. 2031 మార్చికల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 736 డ్యామ్‌లలో తెలంగాణ నుంచి 29 ప్రధాన డ్యామ్‌లు ఉన్నాయి. వీటి కోసం రూ.645 కోట్లు అవుతుందని లెక్కలు వేశారు. డ్రిప్‌ పథకంలో రాష్ట్రం నుంచి చేర్చిన డ్యామ్‌లలో నాగార్జునసాగర్‌, శ్రీపాద ఎల్లంపల్లి, నిజాంసాగర్‌, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, జూరాల, పాకాల లేక్‌, లక్నవరం, రామప్ప లేక్‌, పాలేరు, డిండి, కోయిల్‌సాగర్‌, కడెం, మూసీ, ఎస్సారెస్పీ, వట్టివాగు, స్వర్ణ, ఎల్‌ఎండీ, మల్లూరువాగు, బొగ్గుల వాగు, ఎన్టీఆర్‌ సాగర్‌, కౌలా్‌సనాలా, సాత్నాల, సింగూరు, గడ్డెన్నవాగు, అక్కంపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌, పెద్ద దేవులపల్లి రిజర్వాయర్‌, పీపీఆర్‌ ప్రాజెక్టులున్నాయి. ఇందులో అధికంగా జూరాల డ్యామ్‌ పనుల కోసం రూ.143.44 కోట్లు, నాగార్జునసాగర్‌ కోసం రూ.29.56 కోట్లు, ఎస్సారెస్పీ కోసం రూ.63.48 కోట్లు ఖర్చు చేయాలని భావించారు.


70 శాతం ప్రపంచ బ్యాంకు రుణం..

డ్యామ్‌ల ఆధునికీకరణ, మరమ్మతుల కోసం డ్రిప్‌ పథకంలో చేరితే.. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి 70 శాతం రుణంగా రాష్ర్టానికి అందుతుంది. మరో 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు రూ.645.13 కోట్లను తెలంగాణ ప్రభుత్వం వెచ్చించిన తర్వాత అందులో 70 శాతం రుణరూపంలో తిరిగి అందుతుంది. ఇందుకు వార్షిక వడ్డీ 6.4 శాతం ఉంటుంది. రాష్ట్రంలో చేపడుతున్న ఏ ప్రాజెక్టుల రుణాలు కూడా ఇంత తక్కువ వడ్డీకి లేవు. కానీ, ప్రత్యేక విభాగం లేకపోవడంతో ఈ పథకం పడకేసింది. పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకు డ్రిప్‌-2 కింద రూ.699 కోట్లు, డ్రిప్‌-3లో రూ.400 కోట్లు కేటాయించగా... డ్రిప్‌-2లో ఆ ప్రభుత్వం 13 ప్రాజెక్టులను ప్రతిపాదించింది. ఇందులో 11 ప్రాజెక్టులకు రూ.600 కోట్లకు కేంద్రం ఇప్పటికే సమ్మతి తెలిపింది. ఇక రూ.372 కోట్ల పనులు చేపట్టడానికి వీలుగా కాంట్రాక్టర్లకు అవార్డు కూడా ఇచ్చేశారు. గత ఫిబ్రవరి కల్లా లెక్కలు పరిశీలిస్తే.. రూ.288.11 కోట్లను వెచ్చించడం గమనార్హం. ఒడిసా కూడా ఇప్పటిదాకా రూ.40.59 కోట్లను వెచ్చించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మాత్రం ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా వెచ్చించకపోవడం గమనార్హం.

ఈ పథకం ప్రత్యేకతలు..

  • ఆనకట్టలను వరద ల నుంచి రక్షించుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ. డ్యామ్‌ల గేట్ల మరమ్మత్తులు. గేట్లు దెబ్బతినకుండా ఇతరత్రా నిర్వహణ.

  • రిజర్వాయర్‌ల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకోవడం, ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్లు పెట్టుకోవ డానికి అనుమతినివ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడం.

  • ఎగువ నుంచి వరద సమాచారం తెలుసుకోవడం ద్వారా నిర్వహణకు తగిన కార్యాచరణ.

  • డ్యామ్‌ల రక్షణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానం అన్వయించుకోవడం.

  • ప్రభుత్వం ప్రత్యేక విభాగాన్ని, ఖాతాను/పద్దును ఈ విభాగం కోసం ఏర్పాటు చేయనుంది. తాజాగా మంత్రివర్గంలో ఆమోదించి, ప్రాజెక్టులకు ఐడెంటిఫికేషన్‌ కోడ్‌ ఇచ్చారు. ఆ కోడ్‌ ఆధారంగా బిల్లులు సమర్పిస్తే.. నిధులు విడుదలవుతాయి.

Updated Date - Apr 07 , 2026 | 05:58 AM