Share News

ఖరీఫ్‌ ముంగిట కేంద్రం షాక్‌!

ABN , Publish Date - Jun 02 , 2026 | 04:32 AM

మరో వారంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) నుంచి రాష్ట్రానికి యూరియా కేటాయింపులను కేంద్రం కుదించింది.

ఖరీఫ్‌ ముంగిట కేంద్రం షాక్‌!

  • ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి రాష్ట్రానికి యూరియా కేటాయింపుల కుదింపు

  • గత నెల 65వేల మెట్రిక్‌ టన్నులు.. జూన్‌లో 53వేల మెట్రిక్‌ టన్నులే

  • ప్రస్తుతం రాష్ట్రం వద్ద 3లక్షల మెట్రిక్‌ టన్నుల బఫర్‌ స్టాక్‌ మాత్రమే

  • ఆగ్రోస్‌ ఎండీకి కేంద్రంతో సమన్వయంచేసే బాధ్యతలు

  • ఓడరేవుల వద్ద పర్యవేక్షణకు రాష్ట్రం నుంచి ప్రత్యేక అధికారులు: తుమ్మల

కోల్‌సిటీ, హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): మరో వారంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రామగుండం ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌) నుంచి రాష్ట్రానికి యూరియా కేటాయింపులను కేంద్రం కుదించింది. గత నెలలో 64,500 మెట్రిక్‌ టన్నుల మేర కేటాయింపులు చేసిన కేంద్ర రసాయనాల ఎరువుల శాఖ ఈనెల దానిని 53వేల మెట్రిక్‌ టన్నులకు కుదించింది. గత నెల కంటే 11,500 మెట్రిక్‌ టన్నులు తగ్గించింది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై యూరియా వాడకం మొదలవనున్న తరుణంలోనే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి యూరియా కేటాయింపులను తగ్గించడం రైతులకు ఇబ్బందిగా మారనుంది. ఇప్పటికే రాష్ట్రం వద్ద యూరియా నిల్వలు ఆశించిన స్థాయిలో లేవు. 5.5లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు ఉంటేనే ఖరీఫ్‌లో రైతుల అవసరాల మేరకు సరఫరాకు అవకాశం ఉంటుంది. రాష్ట్రం వద్ద ప్రస్తుతం 3లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఏప్రిల్‌, మే నెలల్లో ఒక ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచే రాష్ట్రానికి 1,27,460 మెట్రిక్‌ టన్నుల యూరియా రవాణా జరిగింది. ఖరీఫ్‌లో ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ఉత్పత్తిలో 90శాతం రాష్ట్రానికి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. పైగా కేటాయింపులను కుదించింది. పశ్చిమాసియా సంక్షోభంతో ఇప్పటికే యూరియా దిగుమతికి ఆటంకం ఏర్పడటంతో రాష్ట్రం ఆర్‌ఎ్‌ఫసీఎల్‌పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఏడాది ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సాంకేతిక సమస్యలతో ఖరీఫ్‌ సీజన్‌లో రెండు నెలలు ప్లాంట్‌ షట్‌డౌన్‌ కావడంతో రాష్ట్ర రైతాంగం విలవిలలాడింది. ఇప్పుడు ప్లాంట్‌ నడుస్తున్న పరిస్థితుల్లో కేంద్రం కేటాయింపులను కుదించడం ఆందోళన కలిగిస్తోంది.


11.5 లక్షల టన్నులివ్వండి: తుమ్మల

ఓడరేవుల్లో నిల్వ ఉన్న యూరియాను వేగవంతంగా తెలంగాణకు తరలించటానికి కేంద్రం అంగీకరించినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, పోర్టు అధికారులు, రైల్వేలు, హ్యాండ్లింగ్‌ ఏజెన్సీలతో సమన్వయం చేసి యూరియా తరలింపును వేగవంతం చేసినట్లు చెప్పారు. ప్రధాన పోర్టుల వద్ద యూరియా రవాణా, ఎగుమతి, దిగుమతి, రైల్వే రేకుల కేటాయింపు, నిల్వల తరలింపు పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు రాష్ట్రం తరఫున ప్రత్యేక అధికారులను నియమించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరా, కేటాయింపులపై తుమ్మల సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. యూరియా సరఫరా, రవాణా అంశాలపై కేంద్రంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన యూరియా కేటాయింపులు పెంచడంతోపాటు, ఓడరేవులకు చేరుకున్న యూరియా నిల్వలను వేగంగా తెలంగాణకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, సర్బానంద సోనేవాల్‌కు లేఖలు రాసినట్లు తెలిపారు. ఖరీఫ్‌లో నెలకు 10 లక్షల టన్నులుగా ఉన్న కేటాయింపును 11.5 లక్షల టన్నులకు పెంచాలని కేంద్ర మంత్రి నడ్డాను కోరినట్లు వెల్లడించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి తెలంగాణకు ప్రత్యేకంగా 2 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. తెలంగాణ అవసరాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఎలాంటి అంతరాయం లేకుండా యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని జేపీ నడ్డా హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలమేరకు దేశీయ ఉత్పత్తి, దిగుమతుల ద్వారా అవసరమైన మేరకు యూరియా సరఫరా నిరంతరం కొనసాగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఓడరేవుల వద్దకు ఇప్పటికే చేరుకున్న యూరియా నిల్వలను వేగంగా తెలంగాణకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు లేఖ రాసినట్లు తెలిపారు. రాష్ట్రానికి కేటాయించిన యూరియా నిల్వల తరలింపు వేగంగా కొనసాగుతోందని, గంగవరం పోర్టు నుంచి 10 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా, మహారాష్ట్రలోని జైగఢ్‌ పోర్టు నుంచి 21 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు వెల్లడించారు. కాగా ఆగ్రోస్‌ ఎండీ కావేటి రాములుకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వశాఖతో సమన్వయంచేసే బాధ్యతలు అప్పగించారు.

Updated Date - Jun 02 , 2026 | 04:32 AM