Share News

ఖజానాపై అదనపు బండ!

ABN , Publish Date - Mar 08 , 2026 | 05:27 AM

పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధం.. రాష్ట్ర ఖజానాపై భారం మోపుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడం...

ఖజానాపై అదనపు బండ!

  • గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపుతో భారం

  • రాష్ట్రంలో 500కే సిలిండర్‌ పథకం అమలు

  • మిగిలినది సబ్సిడీగా ఇస్తున్న సర్కారు

  • ఇందుకు నెలకు 100 కోట్ల చొప్పున భారం

  • సిలిండర్‌పై 60 పెంపుతో రాష్ట్ర ఖజానాపై..15-20 కోట్లు అదనంగా పడనున్న భారం

  • ఐదు నెలలుగా సబ్సిడీ చెల్లించని సర్కారు

హైదరాబాద్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో రాజుకున్న యుద్ధం.. రాష్ట్ర ఖజానాపై భారం మోపుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచడం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా పరిణమించింది. గృహ వినియోగ సిలిండర్‌పై ఒకేసారి రూ.60 పెంచడం.. రాష్ట్ర ప్రభుత్వ ‘రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌’ పథకానికి శరాఘాతంగా మారింది. సిలిండర్‌ ధర పెరగడంతో రాష్ట్ర ఖజానాపై నెలకు అదనంగా రూ.15-20 కోట్ల భారం పడనుంది. ఈ పథకం అమలు కోసం ప్రస్తుతం నెలకు సుమారు రూ.100 కోట్లు అవుతుండగా.. ఇకపై ఈ భారం రూ.120 కోట్ల వరకు పెరగనుంది. పేద వర్గాలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ 2023 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ఆరు గ్యారంటీల్లో భాగమైన ‘మహాలక్ష్మి’ పథకం కింద ఈ రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్‌ పంపిణీని ప్రారంభించింది. అయితే 2024 ఫిబ్రవరి 27న దీనిని ప్రారంభించిన సందర్భంగా అప్పట్లో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.825 ఉండేది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధానమంత్రి ఉజ్వల్‌ యోజన’ కింద రూ.47.50 సబ్సిడీ సొమ్ము పేదల ఖాతాల్లో చేరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా తన మహాలక్ష్మి పథకం కింద రూ.327.50ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేది. ఇలా రూ.375 సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేవి. ‘మహాలక్ష్మి’ పథకం కింద రాష్ట్రంలో 39 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో ప్రతినెలా కనీసం 25 లక్షల మంది అయినా సిలిండర్లను బుక్‌ చేస్తుంటారు. ఈ లెక్కన ప్రతినెలా రూ.100 కోట్ల వరకు సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. తాజాగా సిలిండర్‌పై రూ.60 పెరగడంతో ఈ నెలవారీ భారం రూ.115-120 కోట్లకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


ఐదు నెలల నుంచి పెండింగ్‌లో సబ్సిడీ..

సబ్సిడీ భారం పెరిగిన మాట అటుంచితే.. అసలు ఐదు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సకాలంలో ఖాతాల్లో వేయలేకపోతోంది. గతేడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఐదు నెలలకు సంబంధించిన సబ్సిడీ సొమ్ము సుమారు రూ.500 కోట్ల దాకా బకాయిలు ఉన్నట్లు అంచనా. ఒక్కో లబ్ధిదారుకు 3, 4 సిలిండర్ల సబ్సిడీ సొమ్ము రావాల్సి ఉందని చెబుతున్నారు. రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకం ప్రారంభమైన మొదట్లో.. కేంద్ర ప్రభుత్వ సొమ్ముతోపాటు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము ఎప్పటికప్పుడు లబ్ధిదారుల ఖాతాల్లో పడేది. అంటే.. సిలిండర్‌ను బుక్‌ చేసిన రెండు మూడు రోజుల్లోనే సొమ్ము జమ అయ్యేది. అయితే.. ఏడాది కిందట సిలిండర్‌ ధర రూ.925కు పెరిగింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలాగే తన రూ.47.50ను వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. పెరిగిన ధర ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వం తన స్కీము కింద రూ.377.50ను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలి. కానీ, ఐదు నెలలుగా ఈ సొమ్ము మొత్తానికే జమ కావడంలేదు. ఓవైపు ఇవి పెండింగ్‌లోనే ఉండగా.. ఇప్పుడు సిలిండర్‌ ధర మళ్లీ పెరగడంతో ప్రభుత్వంపై అదనపు భారం పడనుంది.

Updated Date - Mar 08 , 2026 | 05:28 AM