అప్పుల ఊబిలోకి తెలంగాణ : కల్వకుంట్ల కవిత
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:46 AM
తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయించాల్సిన దుస్థితికి తెచ్చారని ...
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కార్ అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, రోజువారీ ఖర్చులకు ఆర్బీఐ దగ్గర చేయించాల్సిన దుస్థితికి తెచ్చారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాగ్ 2024-25 నివేదికలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెల్లడించిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే.. సంపద పెంచుతాం.. పేదలకు పంచుతామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండురోజులు మినహా మిగతా అన్నిరోజులు ఆర్బీఐ నుంచి చేబదులుగా రూ.1.30 లక్షల కోట్లమేర అప్పు తెచ్చి రాష్ట్రాన్ని నెట్టుకురావడం సిగ్గుచేటన్నారు.
కొత్తపార్టీ ఏర్పాటుపై కవిత సమాలోచనలు
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి శ్రేణులతో సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి జిల్లాల వారిగా నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరుపనున్నారు. జాగృతి క్యాడర్ ద్వారా సలహాలు, సూచనలు తీసుకొనేందుకు ఆమె వరుసగా సమావేశం కానున్నట్లు జాగృతి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నాయకులు, కార్యకర్తలతో కవిత సమావేశమవుతారని పేర్కొంది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు, శుక్రవారం ఉమ్మడి నల్లగొండ మహబూబ్‌నగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల నాయకులతో సమావేశమవుతారని వెల్లడించింది.