Share News

7,917 మెగావాట్ల జలవిద్యుత్‌ కేంద్రాలు

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:26 AM

వచ్చే పదేళ్ల నాటికి (2035-36) తెలంగాణలో 7,917 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని కేంద్ర విద్యుత్‌ సంస్థ (సీఈఏ) వెల్లడించింది.

7,917 మెగావాట్ల జలవిద్యుత్‌  కేంద్రాలు

  • వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో ఏర్పాటు చేయటానికి అవకాశాలున్నాయ్‌

  • కేంద్ర విద్యుత్‌ సంస్థ నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే పదేళ్ల నాటికి (2035-36) తెలంగాణలో 7,917 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని కేంద్ర విద్యుత్‌ సంస్థ (సీఈఏ) వెల్లడించింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా 1,49,276 మెగావాట్ల సామర్థ్యం గల జలవిద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు మంగళ వారం ఒక నివేదికను విడుదల చేసింది. పీక్‌ డిమాండ్‌ ఉన్న సమయంలో రోజుకు 6-8 గంటల పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, ఆ డిమాండ్‌ తీర్చేలా పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ కేంద్రాలను డిజైన్‌ చేయాల్సిన అవసరం ఉందని సీఈఏ పేర్కొంది. పంప్డ్‌ స్టోరేజీ జల విద్యుత్‌ కేంద్రాల్లో.. కొండభాగంలో ఒక రిజర్వాయర్‌ ఉంటే దిగువన మరో రిజర్వాయర్‌ ఉంటుంది. కొండభాగంలోని రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేసి... పైపుల ద్వారా దిగువకు జలాలను విడుదల చేస్తున్నప్పుడు... ఆ పైపుల్లో ఉండే టర్బైన్లతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. డిమాండ్‌ ఉన్న సమయంలో కరెంటు ఉత్పత్తి చేసి నీటిని దిగువ రిజర్వాయర్‌లోకి పంపుతారు. డిమాండ్‌ లేని సమయంలో గ్రిడ్‌ నుంచి కరెంట్‌ తీసుకొని.. దిగువ రిజర్వాయర్‌లోని నీటిని కొండభాగంలో ఉన్న రిజర్వాయర్‌కు తీసుకెళ్తారు. దేశంలో 9 చోట్ల పంప్డ్‌ స్టోరేజీ కేంద్రాలు (నదులపై) ఉండగా... అందులో రెండు తెలంగాణలోనే ఉన్నాయి. ఒకటి శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రం కాగా, మరొకటి నాగార్జునసాగర్‌లోని విద్యుత్‌ కేంద్రం.

రూ.5.81 లక్షల కోట్లు అవసరం

దేశంలో మరో 10 పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తగా జలవిద్యుత్‌ కేంద్రాలను నిర్మించాలనుకుంటే.. దక్షిణాది విషయానికొస్తే.. ఏపీలో 32,750 మెగావాట్ల ప్లాంట్లు, తెలంగాణలో 8755.6 మెగావాట్లు, కర్ణాటకలో 7,600 మెగావాట్లు, తమిళనాడులో 21,300 మెగావాట్ల పంప్డ్‌స్టోరేజీ ప్లాంట్ల నిర్మాణానికి అనుకూలతలు ఉన్నాయని సీఈఏ తెలిపింది. యావత్‌ దేశంలో పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ కేంద్రాల నిర్మాణానికి రూ.5.81 లక్షల కోట్ల నిధులు అవసరమని అంచనా వేసింది. తెలంగాణలో పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ కేంద్రాల నుంచి ఐదేళ్లకుగాను కరెంట్‌ కోసం టెండర్లు పిలవగా గ్రీన్‌కో సంస్థ ఇప్పటికే టెండర్లు వేసింది.

Updated Date - Jan 28 , 2026 | 04:26 AM