పీఆర్సీ పదవీకాలం సెప్టెంబరు 30 వరకు పొడిగింపు
ABN , Publish Date - Mar 27 , 2026 | 03:57 AM
ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల పెంపు కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) పదవీ కాలాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
ఉద్యోగులకు ఇప్పట్లో వేతనాలు పెరిగే అవకాశం లేనట్లే
ఉద్యోగులు, పెన్షనర్ల జీతాల పెంపు కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర రెండో వేతన సవరణ సంఘం(పీఆర్సీ) పదవీ కాలాన్ని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఆరు నెలల పాటు అంటే సెప్టెంబర్ 30 వరకు పెంచింది.ఈమేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం అంతర్గత ఉత్తర్వులను జారీ చేశారు. మొదటి పీఆర్సీ పదవీ కాలం 2023 సంవత్సరం జూన్ 30తో ముగిసింది. దీంతో ఉద్యోగులకు కొత్త వేతనాలను స్థిరీకరించడానికి అప్పటి ప్రభుత్వం 2023 సంవత్సరం అక్టోబర్‌లో రెండో పీఆర్సీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్.శివశంకర్ చైర్మన్‌గా, మరో రిటైర్డు ఐఏఎస్ బి.రామయ్య సభ్యుడిగా ద్విసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆరు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అదే సంవత్సరం డిసెంబరులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి కమిషన్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తోంది. ఈ నెల 31తో కమిషన్ పొడిగింపు కాలం ముగియనుండడంతో మరో ఆరు నెలల పాటు పొడిగించింది. దీంతో ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పింఛన్లు ఇప్పట్లో పెరిగే అవకాశాలు కనిపించడం లేదు.