Share News

15 వరకు ధాన్యం కొనుగోళ్లు: ఉత్తమ్‌

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:02 AM

రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. మరో 10- 12 రోజుల పాటు కొనుగోలు...

15 వరకు ధాన్యం కొనుగోళ్లు: ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో జరుగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. మరో 10- 12 రోజుల పాటు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఈ నెల 15 తేదీ వరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌, నిర్మల్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, వికారాబాద్‌ జిల్లాల్లో ధాన్యం నిల్వలు ఇప్పటికీ అధికంగా ఉన్నందున ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, డైరెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌ ఇతర అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై హైదరాబాద్‌లో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. యాసంగిలో ఇప్పటివరకు 70.06 లక్షల మెట్రిక్‌ టన్ను ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఉత్తమ్‌ వెల్లడించారు. మరో 4.95 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉందని తెలిపారు. మొత్తం కొనుగోళ్లు 75 లక్షల మెట్రిక్‌ టన్నులు దాటవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే హమాలీలు, స్వీపర్ల కష్టాన్ని గుర్తించి వారికి వేతనాలు పెంచేలా చర్యలు తీసుకో వాలని అధికారులకు సూచించారు. అర్హులైనవానిరి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించే కార్యక్రమం చేపట్టాలని ఆయన ఆదేశించారు.

Updated Date - Jun 04 , 2026 | 06:02 AM