ఇక డివిజన్ స్థాయిలో ‘ప్రజావాణి’
ABN , Publish Date - May 01 , 2026 | 05:32 AM
ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ విజ్ఞప్తుల కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి విస్తరించింది.
వెంటనే ప్రారంభించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం
తర్వాత మండల స్థాయికి దశలవారీగా విస్తరించాలని సూచన
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ విజ్ఞప్తుల కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజన్ స్థాయికి విస్తరించింది. డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దశలవారీగా దీనిని మండల స్థాయికి విస్తరించాలని సూచించింది. రాష్ట్ర, జిల్లా, రెవెన్యూ డివిజన్ స్థాయిల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం విడుదల చేశారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో దీనిని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పర్యవేక్షిస్తుంటారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. దీనికి రాష్ట్ర నోడల్ అధికారి ఉంటారని, ‘ప్రోగ్రాం మేనేజ్‌మెంట్ యూనిట్ (పీఎంయూ)’ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో ప్రతి శాఖ నుంచి డిప్యూటీ సెక్రటరీ/డిప్యూటీ డైరెక్టర్ స్థాయికి తక్కువ కాకుండా ఒక్కో నోడల్ అధికారిని ప్రజావాణికి కేటాయించాలని సూచించింది. ఆ అధికారులు ప్రజావాణికి హాజరై తమ శాఖలకు సంబంధించిన ప్రజా విజ్ఞప్తులను స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని ఆదేశించింది. జిల్లా స్థాయిల్లో పరిష్కారంకాని సమస్యలను రాష్ట్ర ప్రజావాణిలో పరిశీలించాలని తెలిపింది. ప్రతి శాఖలో ప్రజావాణి విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. జిల్లా స్థాయి ప్రజావాణిని ప్రతి సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్ భవనంలో నిర్వహించాలని కోరింది. సంబంధిత కలెక్టర్ జిల్లా ప్రజావాణి నోడల్ అధికారిగా ఉంటారని, అదనపు కలెక్టర్ అదనపు జిల్లా నోడల్ అధికారిగా వ్యవహరించాలని తెలిపింది. అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు ప్రజావాణికి హాజరై ప్రజా విజ్ఞప్తులను పరిష్కరించాలని ఆదేశించింది. రెవెన్యూ డివిజన్ స్థాయి ప్రజావాణిని ప్రతి సోమవారం సబ్ కలెక్టర్/రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో నిర్వహించాలని, దీనికి సబ్ కలెక్టర్/ఆర్‌డీవో నోడల్ ఆఫీసర్‌గా ఉంటారని తెలిపింది. డీఎల్‌పీవో, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో, వ్యవసాయ అసిస్టెంట్ డైరెక్టర్, డిస్కం డీఈ, ఆర్ అండ్ బీ డీఈఈ, సీడీపీవో తదితర అధికారులు హాజరై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించాలని సూచించింది.
ప్రతి వినతిపత్రాన్ని అప్‌లోడ్ చేయాలి
ప్రజల నుంచి స్వీకరించే వినతిపత్రం, పిటిషన్‌ను ప్రజావాణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి వినతికి ఒక ప్రత్యేక ఐడీతో ప్రజలకు రిసిప్టు ఇవ్వాలని, తద్వారా ప్రజలు తమ వినతి పరిస్థితిని ఆన్‌లైన్ తెలుసుకోవటానికి వీలవుతుందని పేర్కొంది. స్వీకరించిన విజ్ఞప్తులను 30 రోజుల్లోగా పరిష్కరించాలని, వినతిపై తీసుకున్న చర్యల నివేదికల(ఏటీఆర్)ను కూడా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది. ప్రజావాణిపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి రాష్ట్ర స్థాయి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజావాణిని ప్రభావవంతంగా నిర్వహించటానికి అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.