ఖజానాకు కాసుల కిక్కు!
ABN , Publish Date - Apr 02 , 2026 | 03:42 AM
ఆదాయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. శాఖ చరిత్రలోనే తొలిసారిగా ఆదాయం రూ.44,000 కోట్ల మార్కు దాటింది...
తొలిసారి రూ.44 వేల కోట్లు దాటిన ఎక్సైజ్ శాఖ ఆదాయం
2025-26లో రూ.40,209 కోట్ల మద్యం అమ్మకాలు
తగ్గిన బీరు సేల్స్.. పెరిగిన లిక్కర్ ఘాటు
డిసెంబరులో అత్యధికంగా రూ.5,051 కోట్ల విక్రయాలు
హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ఆదాయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు సృష్టించింది. శాఖ చరిత్రలోనే తొలిసారిగా ఆదాయం రూ.44,000 కోట్ల మార్కు దాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు ఏకంగా రూ.40,209 కోట్లకు చేరాయి. ఈ అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు దాదాపు రూ.39,368 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది కాక, మద్యం దుకాణాల ఫీజుల రూపంలో రూ.1,771 కోట్లు, బార్ల ద్వారా రూ.549 కోట్లు, కొత్త షాపుల కేటాయింపు లైసెన్స్ దరఖాస్తుల రూపంలో మరో రూ.2,869 కోట్లు సమకూరాయి. మొత్తంగా 2025-26లో ఎక్సైజ్ శాఖ ఖజానాకు రూ.44,557 కోట్లు ఆదాయం సమకూరింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.44వేల కోట్ల మార్కును దాటడం ఇదే తొలిసారి. ఏడేళ్ల కాలంలోనే ఆదాయం రెట్టింపు కావడం గమనార్హం. 2018-19లో రూ.20,859 కోట్లుగా ఉన్న ఆదాయం 2025-26 నాటికి రూ.44వేల కోట్లు దాటింది. 2024-25తో పోలిస్తే 2025-26లో మద్యం అమ్మకాలు 7శాతం పెరిగాయి. 2024-25లో రూ.37,487కోట్ల అమ్మకాలు జరగ్గా 2025-26లో రూ.39,368 కోట్ల అమ్మకాలు జరిగాయి. అంటే అదనంగా దాదాపు రూ.2,722 కోట్లు సమకూరాయి. 2025-26లో 382.91 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరగ్గా 2024-25లో 372.25 లక్షల కేసులు విక్రయించారు. బీరు అమ్మకాలు పరిశీలిస్తే.. 2024-25లో 536.13 లక్షల కేసులు అమ్ముడవ్వగా 2025-26లో 387.34 లక్షల కేసులు మాత్రమే అమ్ముడయ్యాయి. బీరు అమ్మకాలు 9 శాతం మేర తగ్గాయి.
2025-26లో అమ్మకాలు ఇలా..
పంచాయతీ ఎన్నికలు, కన్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో 2025 డిసెంబరులో మద్యం ఏరులై పారింది. ఒక్క డిసెంబరులోనే రికార్డు స్థాయిలో రూ.5,051 కోట్ల అమ్మకాలు జరగ్గా.. వేసవి ప్రభావంతో మే నెలలో బీర్ల అమ్మకాలు పెరిగి రూ.3,561 కోట్లు వచ్చాయి. అత్యల్పంగా అక్టోబరులో రూ.2,709 కోట్లు వసూలయ్యాయి. జూన్‌లో రూ.3,273 కోట్లు, జూలైలో రూ.3,320కోట్లు, ఆగస్టులో రూ. 3,082కోట్లు, సెప్టెంబరులో రూ. 3,048కోట్లు, నవంబరులో రూ.2,868 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇక 2026 జనవరిలో రూ.3325 కోట్లు, ఫిబ్రవరిలో రూ.3,208కోట్లు, మార్చిలో రూ.3,486కోట్లతో కలిపి మొత్తం రూ.40,209 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. అమ్మకాల్లో 80 శాతం ఎక్సైజ్ శాఖకు సమకూరే ఆదాయమే. అంటే కేవలం మద్యం అమ్మకాల ద్వారానే రూ.39,368 కోట్ల ఆదాయం సమకూరింది.
లైసెన్స్ ఫీజుల పంట...
లైసెన్స్ ఫీజుల రూపంలో 2025-26లో ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం సమకూరింది. రాష్ట్రంలోని 2,620 వైన్ దుకాణాల(ఎ4) ద్వారా అద్దె రూపంలో రూ.1,771 కోట్లు వచ్చాయి. 1,214 బార్ల ద్వారా మరో రూ.549కోట్లు లభించాయి. కొత్త దుకాణాల కోసం వచ్చిన 95,628దరఖాస్తుల ద్వారారూ.2,869 కోట్ల నాన్-రిఫండబుల్ ఆదాయం రావడం విశేషం. అంటే..మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన రూ.39,368 కోట్ల ఆదాయంతో పాటు అన్ని రకాల ఫీజులు, దరఖాస్తు రుసుములతో కలిపి ఆదాయం రూ.44,557 కోట్లకు చేరింది. కాగా, తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి ఎక్సైజ్ ఆదాయం నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. 2015-16లో కేవలం రూ.12,706 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా.. ఇప్పుడు అది రూ.40వేల కోట్లకు చేరింది. అంటే మద్యం అమ్మకాలు సుమారు మూడు రెట్లు పెరిగాయి.