ఎక్సైజ్‌శాఖలో భారీగా బదిలీలు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:58 AM
రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖలో సుదీర్ఘ కాలం తర్వాత భారీ స్థాయిలో బదిలీ ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిషనర్ సి.హరికిరణ్ పర్యవేక్షణలో...
1,912 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు స్థానచలనం
హైదరాబాద్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్‌శాఖలో సుదీర్ఘ కాలం తర్వాత భారీ స్థాయిలో బదిలీ ప్రక్రియ చేపట్టారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కమిషనర్ సి.హరికిరణ్ పర్యవేక్షణలో 1,912 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో 326 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 1,586 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న వారు మూడు రోజుల్లోగా తమకు కేటాయించిన కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్‌శాఖలో ఎనిమిది ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు బదిలీల ప్రక్రియ చేపట్టారు. ఈ ఏడాది జనవరి 31 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారిని పరిగణలోకి తీసుకుని సీనియారిటీ ప్రాతిపదికన ఈ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ ప్రక్రియ కొనసాగింది. జోన్లవారీగా హెడ్‌కానిస్టేబుళ్ల బదిలీలు జరిగాయి. డిప్యూటీ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏడు జోన్లలో బదిలీలు నిర్వహించారు. మరోవైపు సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ఎక్సైజ్‌శాఖలో సీఐ, ఎస్సైల బదిలీలు వెంటనే చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావును తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్, ఎక్సైజ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు టి.లక్ష్మణ్‌గౌడ్ తదితరులు సచివాలయంలో జూపల్లిని కలిసి విజ్ఞప్తి చేశారు.