అక్రమ మద్యం, గంజాయిపై ఎక్సైజ్ ఉక్కుపాదం
ABN , Publish Date - Sep 01 , 2026 | 04:21 AM
రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్), నాటుసారా, గంజాయి కట్టడికి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీలను మరింత ముమ్మరం చేసింది. కేవలం ఎస్టీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలే కాకుండా స్థానిక ఎక్సైజ్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో దాడులు చేశారు.
రెండు నెలల్లో రూ.4 కోట్ల గంజాయి స్వాధీనం
3,086 కేసుల నమోదు.. 2,707 మంది అరెస్టు
హైదరాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్), నాటుసారా, గంజాయి కట్టడికి ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీలను మరింత ముమ్మరం చేసింది. కేవలం ఎస్టీఎఫ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలే కాకుండా స్థానిక ఎక్సైజ్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలు, సిబ్బంది రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో దాడులు చేశారు. గత రెండు నెలల్లోనే ఎక్సైజ్ పోలీసులు బాధ్యులపై 3,086 కేసులు నమోదు చేసి, 2,707 మందిని అరెస్టు చేయడమే కాకుండా.. 487 వాహనాలను సీజ్ చేశారు. రూ.4కోట్ల విలువ చేసే 872 కిలోల గంజాయితో పాటు ఇతర డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, రవాణాదారులపై కఠిన చర్యలు చేపట్టారు. జూలై, ఆగస్టు నెలల్లో కలిపి దాదాపు 11,084 లీటర్ల న ఆటు సారా, 48,169 కేజీల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాటుసారా తయారీకి సిద్దంగా ఉంచిన 1.64 లక్షల లీటర్ల బెల్లం పానకాన్ని క్షేత్రస్థాయిలోనే ధ్వంసం చేశారు. ఇటీవల మెట్‌పల్లి ఎక్సైజ్ అధికారులు రెండు విడతల్లో 100 బాక్సుల అక్రమ మద్యాన్ని పట్టుకోగా.. పహాడీషరీఫ్ వద్ద కూడా భారీగా మద్యం స్వాధీనమైంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, రైళ్లపై జరిపిన తనిఖీల్లో రూ.50 లక్షల విలువైన 2,558 ఎన్డీపీఎల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.