Share News

గాడినపడుతోన్న ఈఎస్‌ఐ వైద్యం!

ABN , Publish Date - Jun 22 , 2026 | 04:34 AM

రాష్ట్రంలోని కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం.. ఈఎస్ఐ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా పలు సంస్కరణలు మొదలయ్యాయి. 2015-2019 మధ్యకాలంలో జరిగిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌...

గాడినపడుతోన్న ఈఎస్‌ఐ వైద్యం!

  • నాచారం ఆస్పత్రిలో తొలిసారిగా 12 పడకల ఐసీయూ

  • 12 కోట్లతో సీటీ స్కాన్‌.. రూ.70 కోట్ల పెండింగ్‌ బిల్లుల విడుదల

  • శంషాబాద్‌, రామగుండం, మహబూబ్‌నగర్‌లో 3 కొత్త ఆస్పత్రులు

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కార్మికుల ఆరోగ్య సంరక్షణ కోసం.. ఈఎస్ఐ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా పలు సంస్కరణలు మొదలయ్యాయి. 2015-2019 మధ్యకాలంలో జరిగిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్-ఈఎస్ఐ) మందుల కుంభకోణం వ్యవహారం నుంచి బయటపడి.. ఈఎస్ఐ వైద్యం నెమ్మదిగా గాడినపడుతోంది. మందుల సరఫరా చేయకుండానే నకిలీ ఇండెంట్ల ద్వారా బిల్లులు డ్రా చేయడం.. మార్కెట్‌ ధర కంటే 400 శాతం అధిక ధరలకు ప్రైవేట్‌ సంస్థల నుంచి మందులు కొనడం.. వంటి అక్రమాలకు పాల్పడినట్లు తేలడంతో ఏసీబీ, ఈడీ అధికారులు రంగంలోకి దిగి పలువురిని అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఈఎస్ఐ ఆస్పత్రుల్లో వైద్యం, మందులు రోగులకు అందకుండా పోయాయి. కేసుల భయంతో పాలన పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అధికారులు వెనకడుగుశారు. పరిస్థితిని మార్చేందుకు కాంగ్రెస్‌ సర్కారు చర్యలు చేపట్టింది. ముఖ్యంగా నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో రాష్ట్రంలోనే తొలిసారిగా 12 పడకల ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ రోగులకు అందుబాటులోకి రానుంది. దీనిని త్వరలోనే కార్మికశాఖ మంత్రి జి. వివేక్‌ వెంకటస్వామి చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే ఆస్పత్రిలో రూ. 12 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సీటీ స్కాన్‌ మిషన్‌ కొనుగోలుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. దీని కోసం త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి నాచారంలో బీఎస్సీ నర్సింగ్‌, జీఎన్‌ఎమ్‌ కోర్సుల కోసం చెరో 30 సీట్లతో నర్సింగ్‌ కాలేజీ ప్రారంభించడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.


రాష్ట్రంలో ఈఎస్ఐ వైద్యసేవలు మరింత విస్తరించడానికి శంషాబాద్‌, రామగుండంలలో 100 పడకలు, మహబూబ్‌ నగర్‌లో 30 పడకల ఆసుపత్రుల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తయినట్లు ఈఎస్ఐ వర్గాలు పేర్కొన్నాయి. వీటితో పాటు సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో మూడు కొత్త ఈఎస్ఐ డిస్పెన్సరీల ఏర్పాటుకు సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో డిస్పెన్సరీల సంఖ్య 71 నుంచి 74కు పెరగనుంది. కాగా, ఈఎస్ఐ ఆస్పత్రులకు ఔషధాలు సరఫరా చేసిన ఏజెన్సీలకు కొన్ని సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకపోవడంతో, పంపిణీ దాదాపుగా నిలిచిపోయి రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితిని గమనించిన ప్రభుత్వం తాజాగా రూ.70 కోట్ల పెండింగ్‌ బిల్లులను విడుదల చేసింది. అలాగే ప్రతీ 4 నెలలకోసారి.. రూ. 50 కోట్లను గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించగా, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అందుకు ఆమోదం తెలిపినట్లు ఈఎస్ఐ వర్గాలు పేర్కొన్నాయి.

త్వరలో ముఖహాజరు విధానం

ఇటీవల ఈఎస్ఐ ఆస్పత్రుల్లోని కొందరు వైద్యులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్పెన్సరీలకు బదిలీ చేసినప్పటికీ.. వారు సమయపాలన పాటించడం లేదని, డిస్పెన్సరీల ముఖమే చూడటం లేదనిఫిర్యాదులు వస్తున్నాయి. గత ఏసీబీ కేసుల భయంతో కొందరు మెడికల్‌ ఆఫీసర్స్‌ మందుల ఇండెంట్‌ను కూడా పెట్టడం లేదని తెలుస్తోంది. ఈ నిర్లక్ష్యానికి అడ్డుకట్ట వేయడానికి, వైద్యుల సమయపాలన పర్యవేక్షించడానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో త్వరలోనే ముఖహాజరు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.

Updated Date - Jun 22 , 2026 | 04:34 AM