ఇక హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ ఈజీ
ABN , Publish Date - Feb 20 , 2026 | 01:41 AM
కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ కావాలంటే సంబంధిత యజమాని అష్టకష్టాల పాలవుతాడు. ఇక వ్యాపార/ వాణిజ్య/ పారిశ్రామిక అవసరాలకు వాడే హైటెన్షన్...
సర్వీసు లైన్ చార్జీలు వడ్డించనున్న ఈఆర్‌సీ
20 కి.మీ లోపు గరిష్ఠంగా రూ.12 వేలు
20 కి.మీ దాటితే భారమంతా కస్టమర్లపైనే
ముసాయిదా విడుదల చేసిన టీజీఈఆర్‌సీ
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ కావాలంటే సంబంధిత యజమాని అష్టకష్టాల పాలవుతాడు. ఇక వ్యాపార/ వాణిజ్య/ పారిశ్రామిక అవసరాలకు వాడే హైటెన్షన్ (హెచ్‌టీ) విద్యుత్ కనెక్షన్ తీసుకోవడానికి సంబంధిత వినియోగ దారుల ఇబ్బందులు చెప్పనలవి కాదు. కానీ, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సాఫీగా ‘హెచ్‌టీ’ కనెక్షన్ పొందే వెసులుబాటు త్వరలో లభించనున్నది. హెచ్‌టీ సర్వీసు పొందుతున్నందుకు సర్వీస్ లైన్ చార్జీలు చెల్లిస్తే సరి. వెంటనే హెచ్‌టీ విద్యుత్ సర్వీస్ కనెక్షన్ లభిస్తుంది. మొత్తం విద్యుత్ కనెక్షన్లలో హెచ్‌టీ కనెక్షన్ల వాటా 25ులోపే అయినా.. ఆదాయం 50 శాతానికి పై చిలుకు ఉంటుంది. కనుక పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార వర్గాలు సులభంగా హెచ్‌టీ కనెక్షన్ పొందేందుకు వీలుగా సర్వీస్ లైన్ చార్జీలను ఖరారు చేసే విషయమై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) గురువారం ముసాయిదాను విడుదల చేసింది. డిస్కమ్‌ల లైన్లకు 20 కి.మీ లోపు ఉన్న పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార విద్యుత్ కనెక్షన్లకు మాత్రమే ఈ చార్జీలు వర్తిస్తాయి. గూగుల్ మ్యాప్ ఆధారంగా రేడియల్ విధానంలో దూరం ఖచ్చితంగా లెక్కించాలి.
20 కి.మీ దాటితే..
డిస్కమ్ విద్యుత్ లైన్లకు.. సంబంధిత పారిశ్రామిక/ వాణిజ్య హెచ్‌టీ కనెక్షన్లకు మధ్య దూరం 20 కి.మీ కంటే ఎక్కువ దూరం ఉంటే మాత్రం లైన్లు వేసి.. వసతుల కల్పనకయ్యే వ్యయమంతా సంబంధిత వినియోగదారుడి నుంచి వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో ఏ కనెక్షన్ అయినా 20 కి.మీ లోపే ఉండే అవకాశం ఉంటుందని, దీనివల్ల అందరికీ ప్రయోజనం కలుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లో టెన్షన్ (ఎల్‌టీ) కనెక్షన్లకు సర్వీసు లైన్ చార్జీలను ఖరారు చేసిన టీజీఈఆర్‌సీ.. హెచ్‌టీ చార్జీల విషయమై విడుదల చేసిన ముసాయిదాపై వినియోగదారులు వచ్చే నెల 12 సాయంత్రం ఐదు గంటల్లోగా సూచనలు/ సలహాలు/ అభ్యంతరాలు వ్యక్తం చేయాలి. ఆ తర్వాత టీజీఈఆర్‌సీ తుది ముసాయిదాను విడుదల చేయనున్నది.
20 కి.మీ లోపు 11 కేవీ సామర్థ్యం కనెక్షన్ - ఒక కిలోవాట్ (కేవీఏ)
బయట తీగల ద్వారా - రూ.3,500
అండర్‌గ్రౌండ్ కేబుల్ ద్వారా- రూ.8000
20 కి.మీ లోపు 33 కేవీ సామర్థ్యం కనెక్షన్ - ఒక కిలోవాట్ (కేవీఏ)
బయట తీగల ద్వారా - రూ.7,000
అండర్‌గ్రౌండ్ కేబుల్ ద్వారా- రూ.12,000