బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్లకు ఈఆర్‌సీ గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Jun 25 , 2026 | 05:02 AM
రాష్ట్రంలో రెండుచోట్ల ఏర్పాటు చేయదలిచిన 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బెస్)కు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ...
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రెండుచోట్ల ఏర్పాటు చేయదలిచిన 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బెస్)కు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు ఉత్తర్వులిచ్చారు. మహేశ్వరం, చౌటుప్పల్‌లో 750 మెగావాట్ల చొప్పున ‘బెస్’ ఏర్పాటు కోసం తెలంగాణ జెన్‌కో టెండర్లు పిలవగా... సారస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కోల్ ఇండియా సంస్థలు ముందుకొచ్చాయి. టెండర్లలో ఆ రెండు సంస్థలు అతి తక్కువగా కోట్ చేయడంతో, వాటికి జెన్‌కో అనుమతినిచ్చింది. డిమాండ్ లేని సమయంలో డిస్కమ్‌లు ‘బెస్’లో కరెంట్‌ను నిల్వ చేసుకుని, డిమాండ్ అత్యధికంగా ఉన్న సమయంలో వినియోగించుకుంటాయి. ఆ సమయంలో టెండర్లు దక్కించుకున్న సంస్థలు 750 మెగావాట్ల విద్యుత్‌ను 4 దఫాలుగా అందించాల్సి ఉంటుంది. దీనికి సార్‌సకు రూ.2.98 లక్షలు, కోల్ ఇండియాకు రూ.3.14 లక్షలను మెగావాట్ చొప్పున డిస్కమ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. మధ్యవర్తిగా తెలంగాణ జెన్ కో ఉండనుంది. దీనికి ట్రేడింగ్ మార్జిన్ కింద 0.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌కు అనుమతినివ్వాలని తెలంగాణ జెన్‌కో, డిస్కమ్‌లు పెట్టుకున్న విజ్ఞప్తిని ఈఆర్‌సీ సమ్మతించింది.తక్షణమే ఒప్పందం చేసుకోవాలని డిస్కమ్‌లు, తెలంగాణ జెన్‌కోను ఆదేశించింది. ఇక దేశవ్యాప్తంగా 30 వేల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌లు పెట్టాలని కేంద్రం నిర్ణయించిన విషయం విదితమే. దీనికోసం ఒక మెగావాట్‌కు 18 లక్షల సబ్సిడీని వయబుల్టీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) కింద కేంద్రం అందించనుంది.