Share News

87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:22 AM

రాష్ట్రంలో విత్తనాల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ...

87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం

  • ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌లో మార్పులు: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విత్తనాల కొరత తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 87.49 లక్షల క్వింటాళ్ల విత్తనాలను అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కందులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలు వంటి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను జిల్లాల్లో ముందుగానే నిల్వ చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం ఖరీఫ్‌ సన్నద్ధత వివిధ అంశాలపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలను మంత్రి తుమ్మల వివరించారు. వర్షాలు ఆలస్యమైనా, వర్షపాతం తక్కువగా నమోదైనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ సాగు ప్రణాళికలను రూపొందించినట్లు పేర్కొన్నారు. వరికి ప్రత్యామ్నాయంగా కందులు, పెసలు, మినుములు, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న, నువ్వులు, ఆముదం వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. యాసంగిలో రైతుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాల ఆధారంగా రాష్ట్ర ఫెర్టిలైజర్‌ బుకింగ్‌ యాప్‌లో పలు మార్పులు చేసినట్లు తెలిపారు.

Updated Date - Jun 15 , 2026 | 04:22 AM