రాష్ట్రంలో ‘ఇంజనీర్ల’ జేఏసీ!
ABN , Publish Date - May 02 , 2026 | 05:47 AM
రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉద్యోగులతో మరో ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ఏర్పాటు కాబోతోంది. రిటైరైన వారిని కొనసాగించవద్దనే ...
ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, సాగునీటి శాఖ, జీహెచ్‌ఎంసీలోని ఇంజనీరింగ్ అసోసియేషన్లు కలిసిఏర్పాటుకు సన్నాహాలు
రిటైరైన వారిని కొనసాగించవద్దన్నదే ప్రధాన డిమాండ్
హైదరాబాద్, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ ఉద్యోగులతో మరో ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ఏర్పాటు కాబోతోంది. రిటైరైన వారిని కొనసాగించవద్దనే (ఎక్స్‌టెన్షన్ ఇవ్వవద్దనే) ప్రధాన డిమాండ్‌తో... రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్, ఇరిగేషన్‌తోపాటు ఆర్‌డబ్ల్యూఎస్ (మిషన్ భగీరథ), జీహెచ్‌ఎంసీలోని ఇంజనీరింగ్ ఉద్యోగుల అసోసియేషన్లు కలిసి కొత్త జేఏసీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. త్వరలోనే కీలక సమావేశం నిర్వహించి, కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలిసింది.
‘ఎక్స్‌టెన్షన్ల’తో పదోన్నతులు రాక..
ఇటీవల ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, సాగునీటి శాఖల్లో పలు కేడర్లలో రిటైరైన ఇంజనీర్లను ప్రభుత్వం మళ్లీ అదే పోస్టుల్లో నియమించింది. ఆర్ అండ్ బీలో ముగ్గురు అధికారులు రిటైరైనా అవే పోస్టుల్లో కొనసాగుతున్నారు. జాతీయ రహదారుల విభాగంలో రిటైరైన అధికారికి ఎక్స్‌టెన్షన్‌లో పదోన్నతి ఇచ్చారు. సాగునీటి శాఖలో చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణరెడ్డి రిటైరవగా, తిరిగి అదే పోస్టులో కొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పంచాయతీరాజ్‌లోని పలు విభాగాల్లోనూ కొందరు అధికారులు ఎక్స్‌టెన్షన్‌లో ఉన్నారని అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ఆర్ అండ్ బీలో సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో తాజాగా ఉద్యోగ విరమణ చేసిన ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎక్స్‌టెన్షన్ కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. ఈ తీరును నిరసిస్తూ కొత్త జేఏసీ ఏర్పాటుకు ఇంజనీరింగ్ ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.
కావాలంటే కన్సల్టెంట్‌గా నియమించుకోండి!
శాఖలో సీనియర్ అధికారులు, ఉద్యోగులున్నా రిటైరైన వారినే కొనసాగిస్తుండటం సరికాదని ఇంజనీరింగ్ అసోసియేషన్లు పేర్కొంటున్నాయి. రిటైరైన వారిని కావాలనుకుంటే ‘కన్సల్టెంట్’గా నియమించుకోవాలని సూచిస్తున్నాయి. అదే సమయంలో ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నాయి. ఆర్ అండ్ బీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు 250వరకు, ఏఈ నుంచి డీఈ పదోన్నతులు 100 వరకు పెండింగ్ ఉన్నాయని.. సాగునీటి శాఖలో ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటిని వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.
పెన్‌డౌన్‌కు సిద్ధంగా ఉన్నాం
ఉద్యోగ విరమణ చేసిన వారిని అవే స్థానాల్లో కొనసాగించడం వల్ల పదోన్నతుల జాబితాలో ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. ఈ క్రమంలో పలు శాఖలు, విభాగాల్లోని ఇంజనీరింగ్ విభాగం అసోసియేషన్లు కలిసి జేఏసీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతాం. అయినా ఎక్స్‌టెన్షన్లు కొనసాగిస్తే ‘పెన్‌డౌన్’ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేం ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పునఃపరిశీలించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- ఎన్.శ్రీను, తెలంగాణ ఆర్ అండ్ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు