Share News

ఫార్మాకు దీటుగా ఇంజనీరింగ్‌ ఎగుమతులు

ABN , Publish Date - Apr 15 , 2026 | 05:10 AM

ఇప్పటివరకు ఫార్మా రంగ ఎగుమతులకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ.. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.

ఫార్మాకు దీటుగా ఇంజనీరింగ్‌ ఎగుమతులు

  • రెండేళ్లలో నాలుగు రెట్లు అభివృద్ధి

  • 2023-24 నుంచి 2024-25 మధ్య ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో 118 శాతం వృద్ధి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు ఫార్మా రంగ ఎగుమతులకు ప్రసిద్ధి చెందిన తెలంగాణ.. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. విమాన విడి భాగాలు, రక్షణ రంగ పరికరాలు, పారిశ్రామిక యంత్రాల ఎగుమతుల్లో రాష్ట్రం గణనీయ వృద్ధిరేటు సాధించింది. 2023-24 నుంచి 2024-25 మధ్య దేశీయ ఇంజనీరింగ్‌ ఎగుమతుల్లో తెలంగాణ 117.9 శాతం వృద్ధితో మొదటి స్థానాన్ని సాధించిందని ‘వాణిజ్య రంగంలో జాతీయ దిగుమతులు, ఎగుమతుల వార్షిక రికార్డులపై విశ్లేషణ (నిర్యత్‌)’ అనే నివేదిక తెలిపింది. 2022-23లో 1827 మిలియన్ల డాలర్లుగా ఉన్న ఇంజనీరింగ్‌ ఎగుమతులు.. 2024-25 నాటికి 103 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధిరేటు (సీఏజీఆర్‌)తో 7535 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. అంటే రెండేళ్లలో రాష్ట్రం నుంచి ఇంజనీరింగ్‌ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నారు. దక్షిణాది రాష్టాల సగటు వృద్ధిరేటు 10 శాతం మాత్రమే. రాష్ట్ర ఎగుమతుల్లో ఇంజనీరింగ్‌ వస్తువుల వాటా 38.44 శాతంగా నమోదైంది. 2025-26తోపాటు వచ్చే పదేళ్లలో ఇదేరకమైన వృద్ధిరేటు సాధించే అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వర్గాల కథనం. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగాల్లో భారీ ఉత్పత్తులు పెరగడం వల్లే ఇంజనీరింగ్‌ ఎగుమతులు పెరిగాయని యూనియన్‌ కమర్షియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ గణాంకాలు తెలిపాయి. 2023-24లో తెలంగాణలో సీఎం రేవంత్‌ రెడ్డి అధికారం చేపట్టే నాటికి ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల్లో 8వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ప్రస్తుతం నాల్గవ అతిపెద్ద ఇంజనీరింగ్‌ ఎగుమతుల రాష్ట్రంగా నిలిచింది. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌ రాష్ట్రాలకు ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల్లో గట్టి పోటీనిస్తున్న తెలంగాణ.. భవిష్యత్తులో మరింతగా ఇంజనీరింగ్‌ ఉత్పత్తులు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పారిశ్రామిక అభివృద్ధి కోసం భారత్‌ ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి అడుగులు పడటంతోపాటు ఇతర రాష్ట్రాల కంటే భారీగా భూములు ఉండటంతో తెలంగాణ దూకుడు ప్రదర్శిస్తుందని పరిశ్రమ వర్గాల కథనం. హైదరాబాద్‌లో లాక్‌హీడ్‌ మార్టిన్‌, బోయింగ్‌, ఎయిర్‌బస్‌, సఫ్రాన్‌, జీఈ ఏవియేషన్‌, ప్రాట్‌ అండ్‌ విట్నీ, కాలిన్స్‌ ఏరోస్పేస్‌, హనీవెల్‌ వంటి అంతర్జాతీయ కంపెనీలు తమ కేంద్రాలను ఏర్పాటుచేయడం, విడి విభాగాల ఉత్పత్తులతో తెలంగాణ కీలక తయారీ రంగంగా అవతరించింది.

Updated Date - Apr 15 , 2026 | 05:10 AM