ఇంజనీరింగ్‌లో 90శాతం సీట్లు భర్తీ!
ABN , Publish Date - Jul 05 , 2026 | 05:27 AM
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రాథమిక సీట్ల కేటాయింపు (మాక్ అలాట్‌మెంట్) జాబితాను సాంకేతిక విద్యా మండలి ...
ఎప్‌సెట్ మాక్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు
కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలో సగం సీట్లే భర్తీ
ప్రైవేటు వర్సిటీల్లో 100శాతం, కాలేజీల్లో 90శాతం భర్తీ
మిగిలిన 8,740 సీట్లు.. సీట్లు రాని 8,740 మంది
హైదరాబాద్ సిటీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రాథమిక సీట్ల కేటాయింపు (మాక్ అలాట్‌మెంట్) జాబితాను సాంకేతిక విద్యా మండలి శనివారం విడుదల చేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 175 ఇంజనీరింగ్ విద్యాసంస్థల్లో కన్వీనర్ కోటా కింద 88,053 సీట్లుండగా.. సీట్లు 79,313 సీట్లు భర్తీ అవుతున్నట్టు అధికారులు తెలిపారు. 8,740 సీట్లు మిగలగా, ఆప్షన్లు పెట్టుకున్న అభ్యర్థుల్లో 8,740 మందికి సీట్లు రాలేదు. అయితే ఇది కేవలం అభ్యర్థుల అవగాహన కోసమే (ప్రాబబుల్ అలాట్‌మెంట్)నని.. ఏదైనా మార్పు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ నెల 7వ తేదీలోగా ఆప్షన్లు ఇచ్చుకోవాలని అధికారులు సూచించారు. 10వ తేదీ నాటికి తొలివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థులు పెద్దగా మార్పులేమీ చేసుకోకుంటే.. దాదాపుగా ఇవే కేటాయింపులు ఉండే అవకాశం ఉందని తెలిపారు. కాగా, విద్యార్థులు పెట్టుకున్న ఆప్షన్ల ప్రకారం.. మొత్తంగా 90శాతం ఇంజనీరింగ్ సీట్లు భర్తీ అవుతున్నాయి. అయితే రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ (కోస్గి) ఇంజనీరింగ్ కళాశాలో సగం సీట్లే భర్తీకాగా.. రెండు ప్రైవేటు యూనివర్సిటీల్లోని 100శాతం సీట్లు నిండుతున్నాయి. ప్రభుత్వ వర్సిటీల్లోని సీట్లలో 85శాతం, ప్రైవేటు కాలేజీల్లో 90శాతం సీట్లు భర్తీ అవుతున్నాయి. మాక్ అలాట్‌మెంట్ ప్రకారం.. ఈ ఏడాది 6,261 మంది అభ్యర్థులు ఈడబ్ల్యుఎస్ కోటా కింద 10శాతం సీట్లు పొందుతుండటం గమనార్హం.
అభ్యర్థుల చూపు కంప్యూటర్ సైన్స్ వైపే..
ఐటీ రంగంలో జాబ్ మార్కెట్ బాగోలేదన్న అభిప్రాయాలున్నా.. చాలా మంది కంప్యూటర్ సైన్స్, సంబంధిత కోర్సుల వైపే మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమవుతోంది. కోర్సుల వారీగా చూస్తే.. సీఎ్‌సఈ సీట్లు 95శాతం, సీఎస్ఈ ఏఐఎంఎల్ 93శాతం, సీఎ్‌సఈ సైబర్ సెక్యూరిటీ 98శాతం, సీఎస్ఈ బిజినెస్ సిస్టమ్ సీట్లు 99శాతం నిండుతున్నాయి. కొద్దిమొత్తంలో ఉన్న సీఆర్‌సీ, సీఐటీ సీట్లతోపాటు బయోమెడికల్, ఎలకా్ట్రనిక్స్ అండ్ టెలిమాటిక్స్, వీఎల్‌ఎ్‌సఐ డిజైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెకట్రానిక్స్, ఆటోమొబైల్ వంటి కోర్సుల్లో 100శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇక చాలా కాలం తర్వాత అత్యధికంగా మెకానికల్ ఇంజనీరింగ్ సీట్లలో 76శాతం, సివిల్ ఇంజనీరింగ్‌లో 81శాతం సీట్లు భర్తీ కావడం గమనార్హం.