Share News

ఖర్చులేని సమస్యలూ పట్టవా?

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:18 AM

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల్లోని ఆర్థికేతర డిమాండ్లనూ పరిష్కరించడానికి మనసొప్పడం లేదా? సమస్యలను వినేందుకూ ముందుకు రావడం లేదెందుకు? అని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం.....

ఖర్చులేని సమస్యలూ పట్టవా?

  • ఆర్థికేతర సమస్యలన్నీ నిరుడు మార్చిలోపే పరిష్కరిస్తామన్నారు

  • ఏడాది గడిచినా అతీగతీ లేదు.. ఉద్యోగ సంఘాల తీవ్ర అసంతృప్తి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్ర జ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల్లోని ఆర్థికేతర డిమాండ్లనూ పరిష్కరించడానికి మనసొప్పడం లేదా? సమస్యలను వినేందుకూ ముందుకు రావడం లేదెందుకు? అని ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, బదిలీలు, ఆర్థికేతర అంశాలు తదితర సమస్యలపై చర్చించి.. ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య వారధిగా పనిచేయాల్సిన ‘జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌’ ప్రతి మూడు నెలలకోసారి సమావేశం కావాల్సి ఉందని, అయితే కౌన్సిల్‌ ఏర్పాటై ఏడునెలలు గడిచినా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా సమావేశం కాలేదని.. ఇదేనా ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి? అని ఆవేదనగా ప్రశ్నిస్తున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం సభ్యులుగా ఉపసంఘం ఏర్పాటు చేసినా.. ఈ ఉపసంఘం నవీన్‌మిట్టల్‌ అధ్యక్షుడిగా లోకేశ్‌ కుమార్‌ ,కృష్ణభాస్కర్‌ సభ్యులుగా అధికారుల కమిటీ ఏర్పాటు చేసినా.. సమస్యల్లో పురోగతి మాత్రం లేదని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉద్యోగులు లేవనెత్తిన 64డిమాండ్లలో 33 డిమాండ్లు ఆర్థికేతర అంశాలకు సంబంధించినవేనని, వాటి పరిష్కారానికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదనే అసంతృప్తి ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఉద్యోగులు లేవనెత్తిన 64 డిమాండ్ల మీద నివేదికలు పంపాలని సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) అన్ని శాఖల అధిపతులకు లేఖలు రాసినా.. ఎవరూ స్పందించలేదు. 2025 మార్చి నాటికి ఆర్థికేతర సమస్యలన్నీ పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చినా ఇప్పటికీ పరిష్కరించలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక.. దీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు వ్యక్తమయ్యాయి. సానుకూలంగా స్పందించిన రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం 2025 సెప్టెంబరు 10న జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటికీ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ఒక్కసారి కూడా జరగలేదు.


టీచర్ల సమస్యలపై ఒక్క సమావేశం పెట్టరా?

ఉపాధ్యాయుల సమస్యల మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి.. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు సేకరించాలని విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినా గత రెండున్నరేళ్లలో సమావేశమే ఏర్పాటు చేయలేదు. ఇదేమీ ఖర్చుతో కూడిన అంశం కాదని.. కనీసం తమ సమస్యలు వినేందుకు కూడా అధికారుల వద్ద సమయం లేదా? అని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సీపీఎస్‌ రద్దు.. ఓపీఎస్‌ అమలు కనీసం ఒక కమిటీ ఏర్పాటు చేయాలని కోరినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అద్దె వాహనాల కేటాయింపులు, చార్జీల మీద కూడా విధివిధానాలు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం నుంచి సహకారం లేదని విమర్శిస్తున్నాయి. వికలాంగుల డైరెక్టరేట్‌, అవుట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌, ప్రభుత్వ పింఛనుదారుల కోసం డైరెక్టరేట్‌, నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు చేయాలని పదే పదే వినతి పత్రాలు ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదనే అసంతృప్తి ఉద్యోగుల్లో నెలకొంది. వైద్య విధాన పరిషత్‌, గ్రంథాలయం, మార్కెట్‌ కమిటీలు, ఎయిడెడ్‌, మోడల్‌ విద్యా సంస్థల వేతనాల చెల్లింపులకు సంబంధించి 010 కిందకు తేవాలని కోరామని.. వైద్య విధాన పరిషత్‌ ఒక్కటే అమలుచేసి మిగిలిన విభాగాల గురించి స్పందన లేదనేది ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్‌ ఫైల్‌ రెండేళ్లుగా డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి బయటకు రావడం లేదని.. ఇందులో ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకున్నా.. సీపీఎస్‌ నుంచి ఓపీఎ్‌సకు మార్చేందుకు సంబంధించిన ఫైల్‌ ఎందుకు పెండింగ్‌లో పెట్టారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఉద్యోగసంఘాలు ఆరోపిస్తున్నాయి.


కొత్త జిల్లాలకు ఉద్యోగులు కావాలన్నా పట్టదా?

అన్ని జిల్లాల్లో డీఈవో, డీఐఈవో, ఎంఈవో పోస్టులు ఖాళీలు ఉన్నాయి. క్యాడర్‌ స్ట్రెంత్‌ పెంచాలని ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, రెగ్యులర్‌ ఉద్యోగులు లేక.. డిప్యుటేషన్ల మీద నెట్టుకొచ్చే పరిస్థితి ఉందని చెబుతున్నారు. అడిషనల్‌ కలెక్టర్ల నియామకంలో రెవెన్యూ శాఖకు సంబంధించి నియమించే అడిషనల్‌ కలెక్టర్లను రెవెన్యూ శాఖ నుంచే కేటాయిస్తుండగా.. లోకల్‌బాడీలకు నియమించే అడిషినల్‌ కలెక్టర్ల విషయంలో పంచాయతీరాజ్‌ నుంచి 40 శాతం, పురపాలక శాఖ నుంచి 30 శాతం, ఐఏఎస్లను 30శాతం వాటాతో నియమించాలని కోరినా.. స్పందన లేదని సంఘాలు చెబుతున్నాయి. సర్వీస్‌ నిబంధనలు తయారు చేయాలని అర్చక సంఘం కోరితే ఇంత వరకు అతీగతీ లేదని.. దీనికయ్యే ఖర్చు కూడా లేదని చెప్పినా స్పందన లేదని విమర్శిస్తున్నాయి. నారాయణపేట్‌, అసిఫాబాద్‌, ములుగు వంటి కొత్త జిల్లాల్లో ఒక జిల్లా అధికారి నాలుగైదు శాఖల బాధ్యతలను చూస్తున్నారని.. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు క్యాడర్‌ స్ట్రెంత్‌ పెంచాలని ప్రతిపాదిస్తే పట్టించుకోలేదని, పంచాయతీరాజ్‌లో గ్రేడింగ్‌ విధానం అమలు చేయాలని కోరినా కదలికే లేదని.. వీటన్నింటికీ ఎలాంటి ఖర్చు కాదనేది ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. సాధారణ బదిలీల సమయంలో తప్ప.. మిగిలిన సమయంలో భార్యాభర్తల (స్పౌజ్‌ కోటా) బదిలీలకు అవకాశం ఇవ్వడం లేదని.. దీనికి ఖర్చు లేకున్నా స్పందించడం లేదని విమర్శిస్తునారు. కాగా హెచ్‌వోడీ కోటా కింద 12.5 శాతం ఉద్యోగుల కేటాయింపులపై ఉత్తర్వులిచ్చినా వాటి అమలు జరగలేదు. మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ కమిటీ భేటీ ఏర్పాటుకు ఉత్తర్వులిచ్చినా అమలు కాలేదు. ఏసీబీ కేసులు, ఇతర విషయాల్లో 6నెలల్లో విచారణ పూర్తి కావాలని జీవో 175 ఇచ్చినా అతీగతీ లేదని.. సంఘాల నాయకులు చెబుతున్నారు. మాజీ సీఎస్‌ శాంతికుమారి నేతృత్వంలో ఉద్యోగుల సర్దుబాటుపై కమిటీ వేసినా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా భేటీ కాలేదని నేతలు చెబుతున్నారు.

Updated Date - Apr 23 , 2026 | 04:18 AM