ఉద్యోగులతో పెట్టుకుంటే అంతే!
ABN , Publish Date - Aug 28 , 2026 | 05:00 AM
ప్రజాప్రభుత్వం అని చెప్పుకొంటున్న రేవంత్ సర్కారు.. ప్రజల్లో భాగమైన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావులు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగులను తీవ్ర అశాంతికి గురిచేస్తోందన్నారు.
సీఎం రేవంత్ మీద గౌరవంతో ఓపిక పట్టాం.. మంత్రులను ఎన్ని సార్లు కలిసినా ప్రయోజనం లేదు
ప్రభుత్వంపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు
సీపీఎస్ రద్దు సహా సమస్యలన్నింటినీ పరిష్కరించాలి
సెప్టెంబరు 1న కలెక్టరేట్ల వద్ద నిరసన
10న లక్షల మందితో చలో హైదరాబాద్
మహాధర్నాలో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్
హైదరాబాద్/కవాడిగూడ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రభుత్వం అని చెప్పుకొంటున్న రేవంత్ సర్కారు.. ప్రజల్లో భాగమైన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావులు ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వం.. ఉద్యోగులను తీవ్ర అశాంతికి గురిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి మీద ఉన్న గౌరవంతో ఇంత కాలం ఓపిక పట్టామని.. ఆయన సూచన మేరకు మంత్రులను, అధికారుల కమిటీని పలుమార్లు కలిసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని చెప్పారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాగించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. డిమాండ్ల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఉద్యోగుల జేఏసీ మహాధర్నా చేపట్టింది. 33 జిల్లాల్లోనూ ఉద్యోగులు, పింఛనర్లు ధర్నాలు చేశారు. పీఆర్సీ ప్రకటించాలని, కరువు భత్యం బకాయిలు మంజూరు చేయాలని, నూతన ఆరోగ్య బీమాను సమర్థంగా అమలు చేయాలని, ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో చేపట్టిన ధర్నాలో జేఏసీ చైర్మన్ మాట్లాడుతూ.. కొత్త పీఆర్‌సీ అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని.. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేదంటే భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పదించకపోతే సెప్టెంబరు 1న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని, సెప్టెంబరు 10న లక్షలాది మందితో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావు మాట్లాడుతూ.. పీఆర్సీ అమలు, డీఏ బకాయిల విషయంలో సర్కారులో కనీస చలనం లేదన్నారు. మహా ధర్నా ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అని, డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల మహాధర్నా విజయవంతమైందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో చావా రవి(యూటీఎఫ్), రవీందర్ రెడ్డి(ట్రెసా), సదానంద్ గౌడ్(ఎస్టీయూ), ముజీబ్(టీఎన్‌జీవో), బి.శ్యామ్(టీజీవో), మధుసూదన్‌రెడ్డి(టీజీఎల్‌ఏ), దాస్యనాయక్(క్లాస్-4) పాల్గొన్నారు