Share News

నిరాహారదీక్షలకు ఉద్యోగుల జేఏసీ పిలుపు

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:05 AM

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు ఆరోపించారు...

నిరాహారదీక్షలకు ఉద్యోగుల జేఏసీ పిలుపు

  • డిమాండ్ల సాధనకు మే 5న రెండో దశ ఆందోళన

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసు అందజేసిన ప్రతినిధులు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్ర జ్యోతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని ఉద్యోగుల ఐకాస ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్ రావు ఆరోపించారు. ఈ నేపధ్యంలో రెండోదశ ఆందోళనలకు సిద్ధమైనట్లు పేర్కొంటూ బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావుకు నోటీసు అందజేశారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న 4 ప్రధాన సమస్యలను పరిష్కరించాలని ఏప్రిల్‌ 17న మండల, జిల్లా కేంద్రాలు, సచివాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జిలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన తెలిపారన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్రఅసంతృప్తి నెలకొందన్నారు. రెండోదశ ఆందోళనల్లో భాగంగా నిరాహార దీక్ష చేపట్టాలని ఒత్తిడి వస్తున్నట్లు ఐకాస ప్రతినిధులు పేర్కొన్నారు. మే 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, హైదరాబాద్‌ ఇందిరాపార్కు వద్ద శాంతియుతంగా ఒక రోజు దీక్ష చేపడతామని తెలిపారు. పీఆర్సీ అమలు, రూ.13 వేల కోట్ల బకాయిల విడుదల, ఈహెచ్‌ఎస్ అమలు, సీపీఎస్‌ రద్దుతోపాటు పెండింగ్‌లో ఉన్న 64 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 23 , 2026 | 05:05 AM