Share News

ఉద్యోగులకు ఆరోగ్యమస్తు

ABN , Publish Date - Feb 13 , 2026 | 05:48 AM

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన ఆరోగ్య పథకాన్ని 15 రోజుల్లో ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది.

ఉద్యోగులకు ఆరోగ్యమస్తు

  • త్వరలోనే 1,056 కోట్లతో బీమా పథకం.. ప్రభుత్వం, ఉద్యోగుల చెరి సగం వాటా

  • సిబ్బంది మూల వేతనం నుంచి 1.5ు కట్‌

  • ‘ఉద్యోగుల హెల్త్‌ కేర్‌ ట్రస్టు’ ద్వారా సేవలు

  • 15 రోజుల్లో పథకం ప్రారంభానికి చర్యలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన ఆరోగ్య పథకాన్ని 15 రోజుల్లో ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. త్వరలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేయనుంది. ఇది అమల్లోకి రాగానే రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు 12,84,532 మందికి వర్తించనుంది. ఈ పథకం కోసం ఉద్యోగులు, పెన్షనర్ల వాటా, ప్రభుత్వ వాటా కలిపి సంవత్సరానికి రూ.1,056 కోట్లు కార్పస్‌ ఫండ్‌ జమ కానుంది. ఈ పథకంపై గురువారం సచివాలయంలో సీఎస్‌ రామకృష్ణారావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘాలు, సచివాలయ ఉద్యోగుల సంఘం, తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్‌, టీఎస్‌ యూటీఎఫ్‌, పీఆర్‌టీయూ, తెలంగాణ రిటైర్డ్‌ అధికారుల సంఘం, తెలంగాణ ప్రభుత్వ రిటైర్డు ఉద్యోగుల సంఘం, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా 15 రోజుల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు.


పథకం అమలు ఇలా..?

గతంలో ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్టు ద్వారా అమలు చేసేవారు. ఆ పథకం కింద ఇది వరకు రూ.5 లక్షల వరకు ఉన్న వైద్య సేవల వ్యయ పరిమితిని గత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచింది. దీనికి ఉద్యోగ సంఘాలు ఒప్పుకోలేదు. నిర్దిష్ట వ్యయ పరిమితి లేకుండా ఎంత వ్యయమైనా భరించేలా స్కీమ్‌ను రూపొందించాలని డిమాండ్‌ చేశాయి. దీంతో ఉద్యోగుల హెల్త్‌ కేర్‌ ట్రస్తు ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా స్కీమ్‌ను వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైగా, ఉద్యోగుల నుంచి కొంత వాటా వసూలు చేయాలని నిర్ణయించినందున స్కీము విడిగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఉద్యోగుల హెల్త్‌ కేర్‌ ట్రస్టును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం 2023 అక్టోబరు 10న జీవో 186ను జారీ చేసింది. ఈ ట్రస్టు చైర్మన్‌గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. చైర్మన్‌ కాకుండా ఉద్యోగుల నుంచి సీఈతో కలిపి ఎనిమిది మంది వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు, పెన్షనర్ల నుంచి ఇద్దరు.. మొత్తం 16 మంది సభ్యులుగా ఉంటారు. ఈ ట్రస్టులో 515 ఎంప్యానెల్డ్‌ ఆస్పత్రులు ఉన్నాయి. దీని ద్వారా ఉద్యోగులకు 1,885 రకాల చికిత్సలు, శస్త్ర చికిత్సలు అందించనున్నారు. రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు మొత్తం 12,84,532 మందికి స్కీమును వర్తింపజేస్తారు. ఆరోగ్య భద్రత స్కీమ్‌ కింద ఉన్న రాష్ట్రంలోని 70,018 మంది పోలీసులు, వారి కుటుంబ సభ్యులు 4,22,829 మంది కూడా ఈ స్కీమ్‌ పరిధిలోకే రానున్నారు. వీరంతా 12,84,532 మందిలో భాగమే. ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్‌ స్కూళ్లు, గురుకులాల సిబ్బందికి పథకం ప్రారంభమైన తర్వాత నిర్వహించే ట్రస్టు సమావేశంలో తీర్మానం చేసి వర్తింపజేయాలని నిర్ణయించారు. సరిహద్దు జిల్లాల్లోని ఉద్యోగులు, పెన్షనర్లు ఒకవేళ పక్క రాష్ట్రాల్లో చికిత్సలు పొందితే వారికీ స్కీమును వర్తింపజేసే విషయమై తర్వాతి సమావేశాల్లో పరిశీలించాలని నిర్ణయించారు.


నిధుల వాటాలిలా..

ట్రస్టుకు కార్పస్‌ ఫండ్‌ విషయమై సమావేశంలో చర్చ జరిగింది. ప్రతి ఉద్యోగి మూల వేతనం నుంచి నెలకు 1.5 శాతం మేర వాటాను మినహాయించి, కార్పస్‌ ఫండ్‌లో జమ చేయాలని నిర్ణయించారు. ఇలా ఉద్యోగుల నుంచి ఏటా రూ.528 కోట్లు జమ కానున్నాయి. ప్రభుత్వం తన వాటా కింద అంతే మొత్తాన్ని కార్పస్‌ ఫండ్‌లో జమ చేయనుంది. ఇలా ఏటా జమ అయ్యే రూ.1,056 కోట్ల నుంచి ఉద్యోగుల చికిత్సకు అయ్యే వ్యయాన్ని ఆస్పత్రులకు విడుదల చేస్తారు. ఇప్పటికే ఉద్యోగుల మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌ కింద ప్రభుత్వం ఏటా రూ.440 కోట్లను బడ్జెట్‌లో కేటాయుస్తోంది. ఇక ఈ నిధులను నిలిపివేసి రూ.528 కోట్లను ఉద్యోగుల ఆరోగ్య పథకానికి బడ్జెట్‌లో కేటాయించనుంది.

త్వరలో మార్గదర్శకాలు జారీ ::: సీఎస్‌ రామకృష్ణారావు

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో 15 రోజుల్లో ఈ స్కీమును ప్రారంభిస్తామని చెప్పారు. ఈ పథకంలో మార్పులు చేర్పులపై రానున్న ట్రస్టు సమావేశాల్లో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో చికిత్సలకు అవకాశమివ్వాలి: యూటీఎఫ్‌

ఇతర రాష్ట్రాల్లో మెరుగైన సేవలు, అవసరమైన వైద్య సేవలు అందితే, వాటిని కూడా ఈ స్కీము కింద పరిగణించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్షుడు చావ రవి డిమాండ్‌ చేశారు. పక్క రాష్ట్రాల్లో ఓపీ ట్రీట్‌మెంట్‌కు అవకాశమివ్వాలని కోరారు. మోడల్‌ స్కూళ్లు, గురుకులాలు, కేజీబీవీలు, సమగ్ర శిక్ష సిబ్బందికి మొదటి దశలోనే స్కీమును వర్తింపజేయాలన్నారు.

Updated Date - Feb 13 , 2026 | 05:48 AM