ఉద్యోగుల బకాయిలు కొండంత!
ABN , Publish Date - Apr 25 , 2026 | 07:18 AM
ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సర్కారు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఈ మొత్తం బకాయిలు సుమారు రూ.14,200 కోట్లు ఉండగా, ఇందులో గత ప్రభుత్వ హయాంలోని బకాయిలే రూ.6 వేల కోట్లు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రతినెలా చెల్లిస్తున్నది గోరంత.. రెగ్యులర్ ఉద్యోగులకు 12 రకాల.. పద్దుల కింద చేయాల్సి ఉన్న చెల్లింపులు
రిటైర్డ్ ఉద్యోగులకు 6 రకాల పద్దుల కింద
మొత్తం బకాయిలు రూ.14200 కోట్లు
ఇందులో పింఛన్‌దారులకు 8వేల కోట్లు
గత ప్రభుత్వంలోని బకాయిలే 6వేల కోట్లు
ప్రతి నెలా 700 కోట్లు చెల్లిస్తున్న ప్రభుత్వం
అరకొర చెల్లింపులపై ఉద్యోగుల్లో అసంతృప్తి
నెలకు సగటున 600 మంది పదవీ విరమణ
ప్రతి నెలా 300 కోట్లు కొత్త బకాయిల జమ
బకాయిలు అందక 85 మంది మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 24 (ఆంధ్ర జ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సర్కారు చెల్లించాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఈ మొత్తం బకాయిలు సుమారు రూ.14,200 కోట్లు ఉండగా, ఇందులో గత ప్రభుత్వ హయాంలోని బకాయిలే రూ.6 వేల కోట్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వం నెలకు రూ.700 కోట్ల చొప్పున చెల్లింపులు చేస్తున్నా.. ప్రతి నెలా ఉద్యోగులు రిటైరవుతున్నందున వారికి చెల్లించాల్సిన మొత్తం అదనంగా జమ అవుతోంది. దీంతో బకాయిల చెల్లింపు ఎంతకీ పూర్తికాని పరిస్థితి నెలకొంది. ఇది ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. రెగ్యులర్ ఉద్యోగులకు 12 రకాల పద్దుల కింద చెల్లింపులు చేయాల్సి ఉండగా, రిటైర్డ్ ఉద్యోగులకు ఆరు రకాల పద్దుల కింద చెల్లించాల్సి ఉంది. ‘‘మిత్రులారా! గుండెకు స్టంట్ వేసుకోవాలి.. అప్పు ఇవ్వండి’’ అంటూ 2025 మార్చి 31న పదవీ విరమణ చేసిన కొత్తగూడెంకు చెందిన ఉద్యోగి కె.శ్రీనివాసరావు.. ఉద్యోగుల జేఏసీకి అప్పట్లో లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఒక్క శ్రీనివాసరావు వేదన మాత్రమే కాదు.. మూడు లక్షల మంది పింఛన్‌దారుల ఆవేదన. పదవీ విరమణ చేసి.. సకాలంలో చేతిలో డబ్బులేక, ప్రభుత్వం ఆదుకోక 85 మంది రిటైర్డ్ ఉద్యోగులు మృతి చెందడంతో ‘ఇది తీవ్రమైన మానవీయ సంక్షోభం’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలపై ఏప్రిల్ 9న హైకోర్టు ఘాటుగా స్పందించింది. పదవీ విరమణ ప్రయోజనాలనేవి ఉద్యోగులు కష్టపడి దాచుకున్న సొంత డబ్బు అని, అది ప్రభుత్వం ఇచ్చే దానం కాదని గుర్తు చేసింది.
కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా..
పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించాలని కోరుతూ కార్యాలయాల చుట్టూ, సచివాలయం చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు కేసులకు విరాళాలు వేసుకుని మరీ ప్రభుత్వంపై పోరాటం చేయాల్సి వస్తుందని రిటైర్డ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవకాశం ఉన్నవారు కోర్టులకు వెళ్లి బకాయిలు తీసుకుంటుంటే.. ఏ అవకాశం లేనివారు 30 ఏళ్లపాటు ప్రభుత్వానికి సేవలందించి, తమ డబ్బు చెల్లించాలని ప్రాధేయపడుతున్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు సుమారు రూ.14,200 కోట్లు ఉండగా, ఇందులో రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలే రూ.8 వేల కోట్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి నెలా 600 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. వారికి సగటున చెల్లించాల్సిన మొత్తం రూ.50 లక్షల చొప్పున లెక్కించినా.. నెలకు రూ.300 కోట్ల బకాయిలు కొత్తగా జమ అవుతున్నాయి. ప్రభుత్వం ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన వారికి కలిపి.. బకాయిల కింద ప్రతి నెలా చెల్లించే మొత్తం రూ.700 కోట్లు. దీంతో ఉద్యోగుల బకాయిలు అలాగే కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రెగ్యులర్ ఉద్యోగులు 3,50,000 మంది, పింఛను తీసుకునేవారు సుమారు 3 లక్షల మంది, ఇతర ఉద్యోగులు 7,50,000 మంది వరకు ఉన్నారని ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. వీరందరికీ గత పదేళ్లుగా చెల్లించాల్సిన బకాయిలను వంద రోజుల్లో చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయి రూ.6 వేల కోట్లతోపాటు రెండున్నరేళ్లుగా చెల్లించాల్సిన బకాయిలనూ క్లియర్ చేస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం ఇప్పటికే అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో 100 రోజుల్లో బకాయిలు చెల్లిస్తామన్న హామీపై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగులు, పింఛన్‌దారులు, ఉపాధ్యాయుల ఒత్తిడితో ప్రభుత్వం గత ఏడాది జూన్ నుంచి పాత బకాయిల చెల్లింపుపై దృష్టి పెట్టింది. తొలుత 2025 జూన్‌లో రూ.180 కోట్లు చెల్లించింది. ఆ తరువాత జూలైలో రూ.480 కోట్లు చెల్లించగా.. ఆగస్టు నుంచి ప్రతి నెలా రూ.700 కోట్ల చొప్పున ఈ ఏడాది మార్చి దాకా చెల్లించింది. అయితే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఈ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచుతామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఉద్యోగ సంఘాల నాయకులకు హామీ ఇచ్చారు. దీనిపై హర్షం వ్యక్తం చేయాలని వారిని కోరగా.. ప్రతి నెలా రూ.1500 కోట్లు ఇస్తే అలాగే చేస్తామని వారు బదులిచ్చారు. కానీ, ఆచరణలో రూ.1000 కోట్లు కూడా అమలు కాలేదని, మళ్లీ పాత లెక్కనే రూ.700 కోట్లు ఇస్తున్నారని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. ఇందులో కూడా ఏ పద్దు కింద ఎంత బకాయి చెల్లిస్తున్నారో చెప్పడం లేదంటున్నారు. ఏదైనా ఒక పద్దు కింద ఉన్న మొత్తం బకాయిలను ఒకేసారి క్లియర్ చేయడమో, లేదా పింఛన్‌దారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఏకమొత్తంగా ఒకేసారి చెల్లించడమో చేస్తే ప్రభుత్వం పట్ల ఉద్యోగుల్లో నమ్మకం పెరిగేదని చెబుతున్నారు. కానీ, అరకొర చెల్లింపులు చేస్తుండటంతో మొత్తం బకాయిల్లో ఏ పద్దు కింద ఎంత క్లియర్ చేస్తున్నారనే స్పష్టత లేకుండా పోయిందని అంటున్నారు.
ఏ విషయంలోనూ స్పష్టత లేదు
ప్రభుత్వం ప్రతినెలా రూ.700 కోట్లు చెల్లిస్తున్నా.. దేనికోసం ఎంత బకాయిలు చెల్లిస్తోందో చెప్పడంలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలా కాకుండా.. ఏదో ఒక పద్దుకు సంబంధించి మొత్తం బకాయిలు ఒకేసారి క్లియర్ చేయడమో, మొత్తం బకాయిల్లో ఒక నెల వాటాను క్లియర్ చేయడమో.. చేస్తే స్పష్టత ఉంటుందని చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏల బకాయిలను ఒకేసారి చెల్లించడం, లేదా పీఆర్సీ బకాయిలు ఒకేసారి.. ఇలా ఏదో ఒకటి చేస్తే ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం కలుగుతుందని అంటున్నారు. ఓవైపు బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులను వేదనకు గురిచేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఆదాయ పన్నుకు సంబంధించి ప్రతినెలా వేతనాల్లో కోత వేయాలంటూ సర్క్యులర్లు ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెగ్యులర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు..
1. జీపీఎఫ్ లోన్లు, సీపీఎస్ నెలవారీ డిడక్షన్ అడ్జ్‌స్టమెంట్ శాలరీ
2. సీపీఎస్ లోన్లు, ఎర్న్‌డ్ లీవ్స్, ఎన్నికల గౌరవ వేతనం
3. వాహనాల అద్దెలు, ఆయిల్ బిల్లులు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు
4. టీజీఎల్‌ఐ లోన్లు, లీవ్ వేతనం, ఫుల్ అడిషనల్ చార్జెస్
5. వేతన పెంపు బకాయిలు, 6/12/18/24 స్కేల్ బకాయిలు
6. కార్యాలయ స్టేషనరీ, టీఏ, ఎఫ్‌టీఏ బకాయిలు
7. ఎడ్యుకేషనల్ అడ్వాన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్
8. పాఠశాలలు, కాలేజీలు, వసతి గృహాల డైట్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు
9. కార్యాలయ ఖర్చులు, విద్యుత్తు బిల్లులు, పెట్రోలు, ఆయిల్, గీజు చార్జీలు
10. పోస్టల్ ఖర్చులు, మూల్యాంకన బకాయిలు
11. పంచాయతీ కార్మికుల వేతనాలు, నర్సులకు రాత్రివేళ డ్యూటీ అలవెన్స్ బకాయిలు
12. యూనిఫాం అలవెన్స్, డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల వేతనాలు, జనాభా లెక్కల రెమ్యునరేషన్ బకాయిలు
రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు..
1. నెలవారీ సర్వీస్ పింఛన్, కుటుంబ పింఛన్
2. గ్రాట్యుటీ, కుమిటేషన్, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్
3. పీఆర్సీ బకాయిలు, ఎర్న్‌డ్ లీవ్‌ల బకాయిలు
4. ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ (ఎఫ్‌బీఎఫ్), గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీం(జీఐఎస్) బకాయిలు
5. టీజీఎల్‌ఐ బకాయిలు, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు
6. అంత్యక్రియలకు సంబంధించి చెల్లించాల్సిన చిన్న చిన్న మొత్తాలను కూడా ఇవ్వడం లేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.