Share News

ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలు బేఖాతరు

ABN , Publish Date - May 28 , 2026 | 03:11 AM

రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల బదిలీల కోసం ఇచ్చిన ఉత్తర్వులను కొంతమంది ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తున్నారని ఉద్యోగుల ఐకాస నిరసన వ్యక్తం చేసింది.

ఉద్యోగుల బదిలీల్లో నిబంధనలు బేఖాతరు

  • జీవో 38 మార్గదర్శకాలకు వక్రభాష్యం చెబుతున్నారు

  • అధికారుల తీరుపై ఉద్యోగుల ఐకాస అసంతృప్తి

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల బదిలీల కోసం ఇచ్చిన ఉత్తర్వులను కొంతమంది ఉన్నతాధికారులు బేఖాతరు చేస్తున్నారని ఉద్యోగుల ఐకాస నిరసన వ్యక్తం చేసింది. జీవో 38 ద్వారా బదిలీలకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసినా.. కొన్ని శాఖల ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. ఉత్తర్వులకు వక్రభాష్యం చెబుతున్నారని ఐకాస ఛైర్మన్‌ మారం జగదీశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాస్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థికశాఖ కొన్ని విభాగాలు, ఆయుష్‌, సంక్షేమశాఖల్లో ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని వారు ఆరోపించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఒకే స్టేషన్‌లో 4 సంవత్సరాలు పూర్తిచేసుకున్న అధికారులకు తప్పనిసరిగా బదిలీ చేయాలని, అలాగే మొత్తం ఉద్యోగుల్లో కేడర్‌ వారీగా 40 శాతానికి మించి బదిలీలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. అధికారులు 4ఏళ్లు పూర్తి చేసుకున్న వారిని బదిలీ చేసినా.. 40 శాతం కోటా భర్తీ కాలేదనే నెపంతో.. 3 ఏళ్ల సర్వీస్‌ ఉన్న వారిని కూడా బదిలీ చేస్తామని చెప్పడం నిబంధనలు ఉల్లంఘించడమేనని ఆరోపించారు. మరికొన్ని శాఖల్లో అధ్యక్ష, కార్యదర్శులకే మినహాయింపునిస్తూ, కార్యవర్గానికి మొండిచేయి చూపుతున్నారని అన్నారు. ఆయు్‌షలో ఖాళీల వివరాలు చెప్పడం లేదని, బదిలీ అర్హత ఉన్న సీనియర్‌ ఉద్యోగుల జాబితా ప్రకటించడం లేదని, ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలను తీసుకోకపోవడంపై వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. మే 31 వరకు బదిలీల ప్రక్రియ ముగిసిపోవాలని ప్రభుత్వం గడువు పెట్టినా, ఆదాయాన్ని సమకూర్చే ఆబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖల్లో అధికారులు బదిలీల ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని సీఎం రేవంత్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు దృష్టికి తీసుకెళతామని, అవసరమైతే న్యాయపోరాటానికి వెనకాడబోమని ఐకాసా స్పష్టం చేసింది.

Updated Date - May 28 , 2026 | 03:11 AM