Share News

ప్రపంచ ఏరోస్పేస్‌ రాజధానిగా తెలంగాణ

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:39 AM

తెలంగాణ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగం గత కొన్నేళ్లుగా దాదాపు 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, గత ఏడాది ఎగుమతులు 103 శాతం పెరిగి, రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా..

ప్రపంచ ఏరోస్పేస్‌ రాజధానిగా తెలంగాణ

  • వృద్ధిలో ఔషధ రంగాన్ని దాటేసిన ఏరోస్పేస్‌

  • రాష్ట్ర పారిశ్రామిక చరిత్రలో సువర్ణాధ్యాయం

  • రాష్ట్రంలో 1500కి పైగా ఏరోస్పేస్‌ ఎంఎస్ఎంఈలు

  • వరంగల్‌, ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుల పనులు త్వరలో ప్రారంభం

  • ఏరోమార్ట్‌ హైదరాబాద్‌-2026 సదస్సులో మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగం గత కొన్నేళ్లుగా దాదాపు 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేయగా, గత ఏడాది ఎగుమతులు 103 శాతం పెరిగి, రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా అగ్రగామిగా ఉన్న ఔషధ రంగాన్నే అధిగమించడం తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం విమానయాన రంగ విస్తరణకు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఏరోమార్ట్‌ హైదరాబాద్‌-2026’ అంతర్జాతీయ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ బిజినెస్‌ కన్వెన్షన్‌ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘‘ప్రపంచ ఏరోస్పేస్‌ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణే కొత్త చిరునామా. ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో ప్రపంచపటంలో హైదరాబాద్‌ అగ్రస్థానంలో నిలవబోతోంది.’’ అని స్పష్టం చేశారు. వైమానిక దళంలో ఫైటర్‌ పైలట్‌గా పనిచేసిన అనుభవాన్ని మంత్రి ఉత్తమ్‌ గుర్తు చేసుకుంటూ, సూపర్‌ సోనిక్‌ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్‌ రంగంలో నాణ్యత, కచ్చితత్వం ఎంత కీలకమో తనకు అనుభవం ఉందన్నారు. ‘‘ఒక్క చిన్న విడిభాగలోపం కూడా మిషన్‌ విజయాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి అత్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నాయి’’ అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్‌కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, ఎఫ్‌-16 యుద్థ విమానాల రెక్కలు, ప్రపంచ ప్రఖ్యాత ఏరో ఇంజిన్‌ విడిభాగాలు ఇవాళ తెలంగాణలోనే తయారవుతున్నాయని మంత్రి తెలిపారు.


‘మేడ్‌ ఇన్‌ తెలంగాణ’ అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతోంది’’ అని పేర్కొన్నారు. స్పెయిన్‌కు చెందిన ఐటీపీ ఏరో, కెనడాకు చెందిన ఎఫ్‌టీజీ ఏరోస్పేస్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర పారిశ్రామిక విశ్వసనీయతకు నిదర్శనమన్నారు. ఫ్రాన్స్‌, ఇటలీ సహా 25కు పైగా దేశాల కంపెనీలు ఏరోమార్ట్‌లో పాల్గొనడం తెలంగాణ అంతర్జాతీయ ప్రాధాన్యాన్ని మరింత పెంచిందని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 1,500కు పైగా ఏరో ేస్పస్‌, డిఫెన్స్‌ రంగాలకు సేవలందిస్తున్న ఎంఎస్ఎంఈలు పనిచేస్తున్నాయని, పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక పారిశ్రామిక పార్కులు, ప్రత్యేక ఆర్థిక మండలాలు, ప్లగ్‌-అండ్‌-ప్లే మౌలిక సదుపాయాలు రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత ఆకర్షణీయ పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాయని చెప్పారు. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మారుతున్న ఐటీఐలు ప్రపంచస్థాయి ఏరోస్పేస్‌ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యంతో కూడిన యువతను తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు. వరంగల్‌ విమానాశ్రయానికి వచ్చే నెలలో శంకుస్థాపన, ఆదిలాబాద్‌లో పౌర-సైనిక అవసరాలకు అనువైన ఎయిర్‌ఫీల్డ్‌, కొత్తగూడెం విమానాశ్రయానికి త్వరలో కేంద్ర ఆమోదం లభించనున్నాయని వివరించారు. ఈ మూడు కేంద్రాలు భవిష్యత్తులో విమాన మరమ్మత్తు, విమాన తయారీ, రక్షణ పరిశ్రమలకు భారీ అవకాశాలను తెరవనున్నాయని చెప్పారు. ప్రపంచ ఏరోస్పేస్‌ దిగ్గజాలను ఉద్దేశించి మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘‘మీ తదుపరి తయారీ కేంద్రం తెలంగాణ కావాలి. మీ తదుపరి పెట్టుబడి హైదరాబాద్‌లో ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం మీకు అనుమతులు ఇచ్చే ప్రభుత్వం మాత్రమే కాదు... మీ విజయానికి భాగస్వామిగా నిలిచే ప్రభుత్వం’’ అని ఆయన భరోసానిచ్చారు. ‘‘ఏరోమార్ట్‌ హైదరాబాద్‌- 2026’’ కేవలం ఒక పారిశ్రామిక సదస్సు కాదు.. ప్రపంచ ఏరోస్పేస్‌ పటంలో తెలంగాణ శాశ్వత స్థానాన్ని ఖరారు చేసే చారిత్రక వేదిక అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Jul 01 , 2026 | 05:40 AM